భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న ప్రధాని మోడీ.. దేశ రక్షణలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. సరిహద్దు ఉద్రిక్తతల తరుణంలో ప్రధాని లడఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. గాల్వన్ అమరులకు నివాళులు అర్పించి.. సైనికులతో సమావేశమయ్యారు. సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిములో సీనియర్ సైనికాకధికారులతో భేటీ అయిన తొలి ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. 

 

భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో..  మూడోకంటికి కూడా తెలియకుండా కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో పర్యటించారు ప్రధాని మోడీ. ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జరనల్‌ ఎంఎమ్‌ నరవణేతో కలిసి మోడీ లడఖ్ వెళ్లారు. గాల్వన్ లోయ హింసాత్మక ఘటనలో గాయపడిన సైనిక జవాన్లను 11 వేల  అడుగుల ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం నిములో పరామర్శించారు. అలాగే చైనా-భారత్‌ కమాండర్‌ స్థాయి  సమావేశాల్లో పాల్గొన్న సైనిక అధికారులతో మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

 

సరిహద్దుల్లో సైనికులు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చితంగా ఉందని ప్రధాని చెప్పారు. ప్రపంచానికి భారత్‌ శక్తి సామర్థ్యాలు నిరూపించారని కొనియాడారు. విస్తరణ వాదానికి కాలం చెల్లిందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రధాని. భారత్‌ శక్తి సామర్థ్యాలు అజేయమన్నారు ప్రధాని మోడీ. జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో సమున్నతంగా ఉన్నామని గుర్తుచేశారు. దేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అంతమాత్రాన దేశరక్షణలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు మోడీ. విశ్వశాంతి కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర భారతీయులకు ఉందన్నారు ప్రధాని మోడీ. మానవత్వాన్ని కాపాడటం కోసం మొదట్నుంచీ చాలా కృషి చేశామని ఆయన గుర్తుచేశారు. దేశ మహోన్నత సంస్కృతికి నాయకులు సైనికులే అన్నారు ప్రధాని. 

 

మోడీ లడఖ్ పర్యటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. మోడీ టూర్ తో సైనికుల ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. మోడీ పర్యటనపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలు జరుగుతున్న సమమయంలో.. ఎవరూ ఉద్రిక్తతల్ని పెంచే ప్రయత్నం చేయకూడదని ఆ దేశ విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. మోడీ సరిహద్దు నుంచి యుద్ధ సందేశం ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. సరిహద్దుల్లో భారతపై దురాక్రమణకు కాలుదువ్వుతున్న డ్రాగన్‌కు ముకుతాడు వేసేందుకే.. మోడీ అకస్మాత్తుగా లడఖ్ వచ్చారని చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: