గత ఏడు వారాల నుంచి ఇండియా, చైనీస్‌ ఆర్మీకి తూర్పు లడఖ్‌లో గొడవలు జరుగుతున్నాయి. జూన్‌ 15 న గాల్వాన్‌ వ్యాలీలో 20 మంది భారత జవాన్లను చైనీస్‌ ఆర్మీ చంపేయడంతో దేశంలో బాయ్‌కాట్‌ చైనా ప్రొడక్ట్స్‌ ఉద్యమం దేశంలో మరింత ఊపందుకుంది. ఇప్ప‌టికే మ‌న కేంద్ర ప్ర‌భుత్వం స‌హా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు షాకింగ్ నిర్ణ‌యాలు తీసుకున్నాయి. తాజాగా చైనాకు మ‌రో షాక్ త‌గిలింది. వచ్చే రెండేళ్లలో చైనా దిగుమతులను జీరోకి తగ్గించుకుంటామని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ గ్రూప్‌ ఏడాదికి 400 మిలియన్‌ డాలర్ల మేర చైనా నుంచి దిగుమతులు చేసుకుంటోంది. వీటిని జీరోకి తగ్గిస్తామని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌‌ పార్థ్‌ జిందాల్ ప్ర‌క‌టించారు. 

 

దురాక్ర‌మ‌ణ కాంక్ష‌తో స‌రిహ‌ద్దుల్లో గాల్వ‌న్ లోయ వ‌ద్ద భార‌త్ వైపు చొచ్చుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది. చైనా ఆర్మీ దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో భార‌త సైనికులు నిలువ‌రించారు. ఈ స‌మ‌యంలో ప‌ర‌స్ప‌రం ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చైనా సైనికులు ఇనుప‌రాడ్లు, క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడికి దిగారు. వాళ్ల దాడిని అంతే దీటుగా తిప్పి కొట్టారు భార‌త జ‌వాన్లు. తీవ్రంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రుల‌య్యారు. ఈ నేప‌థ్యంలో జిందాల్ గ్రూప్ స్పందించింది. ‘భారత గడ్డ మీద మన వీర సైనికులపై చైనీస్‌ ఆర్మీ దాడులు చేయడం మనకొక మేలుకొలుపు లాంటిది. ఒక యుద్ధభేరి లాంటిది. ఏటా నికరంగా చైనా నుంచి మా జిందాల్‌గ్రూప్‌కు 400 మిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు జరుగుతున్నాయి. వీటి విలువను వచ్చే 24 నెలల్లో సున్నాకు తగ్గిస్తాం..బాయ్‌కాట్‌ చైనా’ అంటూ పార్థ్‌ జిందాల్‌ ప్రకటించారు. జేఎస్‌డబ్యూ గ్రూప్‌ ఓనర్‌‌ సజ్జన్‌ జిందాల్‌ కుమారుడైన పార్థ్‌ జిందాల్ ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స్టీల్‌, ఎనర్జీ, సిమెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలకమైన సెక్టార్లలో జిందాల్ గ్రూప్‌ వ్యాపారాలు చేస్తోంది. చైనా నుంచి ఈ గ్రూప్‌ ఎక్కువగా  స్టీల్‌, ఎనర్జీ బిజినెస్‌ల కోసం దిగుమతులు చేసుకుంటోంది. అయితే, తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకొని చైనాకు షాకిచ్చింది.

 


కాగా, ల‌ఢ‌ఖ్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్యటించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై చైనా ఊహించ‌ని రీతిలో స్పందించింది. స‌రిహ‌ద్దుల్లోని మ‌న జ‌వాన్ల‌తో స‌మావేశ‌మైన ప్ర‌ధాని వారిలో నైతిక స్థైర్యం పెంచేలా ప్ర‌య‌త్నించిన కొద్ది గంట‌ల్లోనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి లిజియాంగ్ మాట్లాడారు. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల‌ను పెంచే ఎటువంటి చ‌ర్య‌ల‌కూ ఇరు దేశాల్లో ఏ ఒక్క‌రూ పూనుకోవ‌ద్ద‌ని అన్నారు. భార‌త్, చైనా మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బరిచేందుకు మిల‌ట‌రీ, దౌత్య ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఇటువంటి స‌మ‌యంలో ప‌రిస్థితులు వేడెక్క‌కుండా చూసుకోవాల‌ని లిజియాన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: