నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని ఆ పార్టీ సీరియస్ గానే ముందుకు తీసుకు వెళ్లేలా కనిపిస్తోంది. ఈరోజు లోక్ సభలో స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా, ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు వేయాలని తాము ఫిర్యాదు చేసినట్టుగా వారు మీడియాకు చెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్  అన్ని విషయాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రఘురామకృష్ణంరాజు పై తప్పక చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని, రఘురామకృష్ణరాజు వైసీపీ లోనే ఉంటూ, ప్రతిపక్షాలతో మంతనాలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని, కనీసం పార్టీ అధ్యక్షు డుని గౌరవించకపోవడం, క్రమశిక్షణ ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి అనేక చర్యకు పాల్పడ్డారని విమర్శించారు.


 మొత్తంగా చెప్పాలంటే రఘురామకృష్ణంరాజు సొంత పార్టీలోనే విపక్షం లాంటి వారని, వైసీపీ లో ఉంటూనే ఇతర పార్టీలతో మంతనాలు చేశారని, విపక్షాలతో లాలూచీ పడి పార్టీపై తప్పుడు ప్రచారం చేయాలనుకుంటున్నారని, ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షుడుకి  చెప్పుకోవాలి కానీ, బహిరంగంగా ఇలా అల్లరి చేయడం పార్టీ విధానాలకు విరుద్ధంగా అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. రఘురామ కృష్ణం రాజు హార్ట్ అండ్ సోల్ ఇక్కడ లేదని, మనసా, వాచా, కర్మణా పనిచేసే వారు మాత్రమే వైసీపీకి కావాలని, అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు.

 

 

మొత్తంగా చూస్తే రఘురామకృష్ణంరాజు పై కఠిన చర్యలు తీసుకునే వరకు వైసీపీ వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.రఘురామకృషం రాజుపై తప్పకుండా వేటు పడుతుందనే నమ్మకంతో వైసీపీ ఉంది. నరసాపురంలో ఉప ఎన్నిక తప్పదు అనే అభిప్రాయంలో అక్కడ అభ్యర్థిని వెతికే పనిలో వైసీపీ ఉంది. ఈ మేరకు టీడీపీ మాజీ మంత్రి పితానిని పార్టీలో చేర్చుకుని అక్కడి నుంచి ఎంపీగా బరిలో దించేందుకు వైసీపీ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: