జగన్.. ఆ పేరులోనే ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. జగన్ అన్న మూడు అక్షరాలు ఏపీ రాజకీయాలను గత పదేళ్ళుగా ఊపేస్తున్నాయి. జగన్ 2009లో ఎంపీ కాకముందు ఆయన‌ ఎవరికీ పెద్దగా తెలియని వారే. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ఇపుడు ఏపీని పూర్తిగా తన వైపు తిప్పుకుని చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగుతున్నారు.

 

కరోనా వంటి విలయంలో కూడా దేశంలో అనుభవశాలులు అయిన పాలకులు ఎందరో చేతులెత్తేస్తున్న వేళ జగన్ మాత్రం పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.  ఇపుడు జనసేన వంటి పార్టీలు సైతం జగన్ని ప్రశంసించడాన్ని  ఆ విధంగానే చూడాలి. ఇదిలా ఉండగా తన పాలన పట్ల జనంలో సంత్రుప్తి ఉంది. పార్టీలో అక్కడకక్కడ లుకలుకలు ఉన్నాయి. వాటిని కూడా లేకుండా చేసుకోవాలని జగన్ గట్టి ప్రణాళికలే వేస్తున్నారు.

 

అందులో భాగంగానే ఆయన ఏరి కోరి మరీ నర్సాపురం ఉప ఎన్నికలు తేవాలనుకుంటున్నారు అంటున్నారు. తన మీద, పార్టీ మీద విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్న నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజుని ఉప ఎన్నికల ముగ్గులోకి లాగి ఓడించాలన్నది జగన్  పంతంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్లాలని,  ఉప‌ఎన్నిక మాత్రం తీసుకురావాలని జగన్ గట్టి పట్టుదల మీద ఉన్నారు.

 

ఈ ఉప ఎన్నికల్లో ఎటూ వైసీపీ ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. ఏడాదిగా జగన్ పాలన బాగానే ఉంది. తాజా సర్వేలు కూడా అదే విషయం స్పష్టం చేశాయి. మరో వైపు చూసుకుంటే గతం కంటే విపక్షం ఊపు కూడా తగ్గింది. ఉప ఎన్నిక అంటూ జరిగితే అధికార పక్షానికే ఎపుడూ ఎడ్జి ఉంటుంది. ఇన్ని రకాలుగా ఆలోచనలు చేసుకున్న మీదటనే రాజుకు తలాక్ చెప్పాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.

 

ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఇటు సొంత పార్టీలో తాటాకు చప్పుళ్ళు చేస్తున్న వారి తోకలు కట్ చేస్తానని గట్టిగా సందేశం ఇవ్వడం, పార్టీ మారినా కూడా మీరు గెలవలేరు అని మరో సంకేతం పంపడం, అటు విపక్షం సత్తా  కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జగన్ అజెండాగా చెబుతున్నారు. అంటే బహుముఖ వ్యూహంతోనే జగన్ ఉప ఎన్నికలకు తెర రేపుతున్నారని అంటున్నారు. ఒక్క దెబ్బకు అన్ని పిట్టల్లొ రాలాల్సిందేనని జగన్ గట్టిగా భావిస్తున్నారుట. మొత్తానికి నర్సాపురానికి బై పోల్ తప్పదంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: