దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ మరో రెండు వారాల్లో కరోనాను నయం చేసే ఔషధాలపై జరుగుతున్న ప్రయోగ ఫలితాలు రానున్నట్లు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5,500 మందిపై 39 దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఏదో ఒక వ్యాక్సిన్ కరోనాను కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రజలకు ఊరటనిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను, రిటోనావిర్ ను మనుషులపై ఎక్కువగా ప్రయోగిస్తున్నారని... ఈ ఔషధాలు ఇచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలను సైతం గమనిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18 వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగాల దశకు చేరుకున్నాయి.      
 
భారత వైద్య పరిశోధన మండలి ఆగష్టు నెల 15 నాటికి కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మరో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి మైక్ ర్యాన్ మాట్లాడుతూ వైరస్ కు సంబంధించిన సమాచారం వెలుగులోకి వస్తున్న కొద్దీ సంస్థ అందుకనుగుణంగా చర్యలను తీసుకుంటోందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బందికి పరికరాల అందవేతలో మాత్రం జాప్యం జరిగిందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: