దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయి గుట్టల గుట్టలుగా శవాలు పెరుకుపోతున్నాయి. అయితే కరోనా తో మరణించిన వారి పట్ల వైద్యుల తీరు ఆవేదన కలిగిస్తోంది. కరోనా తో చనిపోవడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా ఆస్పత్రి వారే వారి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. అందరూ ఉండి కూడా అనాథ శవాలుగా వారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. చాలా మంది కుటుంబ సభ్యులు తమ వారిని కూడా తీసుకెళ్లడానికి ముందుకురావడం లేదు. ఇటీవల కరోనా డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాలో జేసీబీల్లో తరలిస్తే... కర్నాటకలో వైద్య సిబ్బంది మృతదేహాన్ని దారుణంగా ఈడ్చుకెళ్లారు.

 

 

కర్నాటక యాదగిరి జిల్లా లో పిపిఈ సూట్ లు ధరించిన సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతి దారుణంగా ఈడ్చుకువెళ్లి అంత్యక్రియలు జరిపిన విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. 
తాజాగా  బెంగుళూరులో నడివీధిలో రోడ్డుపై కరోనా మృతదేహం గంటలతరబడి ఉండిపోయింది. ఓ వ్యక్తి గొంతు నొప్పి రావడంతో గురువారం కరోనా టెస్టులు చేయించుకున్నాడు. అయితే శుక్రవారం రిపోర్ట్ వచ్చింది. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రికి వెళ్లేందుకు బయల్దేరాడు. రోడ్డుపై రాగానే అతడికి గుండెపోటు కూడా రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అయితే కొద్దిసేపటికే ఆయన మరణించాడు. అయితే మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించడానికి అంబులెన్స్ కు ఫోన్ చేసినా సరిగా స్పందించలేదు.

 

అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో ఆ మృతదేహం నడిరోడ్డుపైనే ఉండిపోయింది. దాదాపు 4 గంటల పాటు ఆ డెడ్ బాడీ అలా ఉండటం వల్ల చుట్టూ పక్కల ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. అటుగా చాలా మంది వెళ్తున్న కనీసం ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నడి రోడ్ మీద కరోనా మృతదేహాన్ని అలా వదిలేయడం మానవత్వానికి మచ్చ వంటిదే అని కొందరు అభిప్రాయపడ్డారు. కరోనా మరణాలు పట్ల ప్రభుత్వం స్పందించి మృతదేహాలను భద్రంగా తరలించి అంత్యక్రియలు జరిపించాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: