సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అకుంఠిత దీక్షతో పార్టీని స్థాపించిన విష‌యం తెలిసిందే. ఎంత సుధీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను..బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను.. అంటూ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ప‌వ‌న్.. ప్ర‌తి విష‌యంపై త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే తాజాగా ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఎప్పుడూ విరుచుకుపడే పవన్ కళ్యాణ్.. తాజాగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. 

 

ఏపీలో వైద్య ఆరోగ్య సదుపాయాలను మరింత పటిష్టం చేసేందుకు గాను ప్రభుత్వం 104, 108 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ‘ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ రెడ్డిగారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్స్‌లని ప్రస్తుతం వున్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం..’ అని పేర్కొన్నాడు. అంతే కాదు, ‘ఇది ప్రపంచానికి గడ్డు కాలం. అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం.. క్షేమంగా వుందాం..’ అని ప‌వ‌న్ చెప్పుకొచ్చాడు. 

 

అయితే ఒకప్పుడు జగన్‌ను సీఎం అని సంబోధించేందుకు కూడా ఇష్టపడని పవన్... ఇప్పుడు తనే స్వయంగా ఆయనకు అభినందనలు చెప్పడంపై కొంద‌రు ట్రోల్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. ఎన్న‌డూలేని విధంగా ప‌వ‌న్ ఎందుకు జ‌గ‌న్‌ను పొగ‌డుతున్నాడ‌నే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. కేవ‌లం బాధ్య‌తోనే ప్ర‌శంసించారా..? లేదా జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డి పొగుడుతున్నారా..? అని కొంద‌రు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే వ‌స్త‌వానికి.. రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి.. అని మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్న విషయం తెలిసిందే. మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం అని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ కూడా నిరూపిస్తున్నాడు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: