కరోనా దెబ్బకు ఆటలు అటకెక్కేశాయ్‌. ప్రపంచవ్యాప్తంగా మైదానాలు మూగబోయాయ్. అయితే క్రీడాభిమానులకు కిక్‌నిస్తూ ఫార్ములా వన్ రేస్‌ మొదలైంది. కరోనా ఆంక్షలను ఛేదించుకుని.. రయ్‌ రయ్ మంటూ ట్రాక్‌లో రేసర్లు మెరుపు వేగంతో కార్లను నడిపారు.

 

కరోనా ఎఫెక్ట్‌తో మూడు నెలల పాటు క్రీడా రంగం స్తంభించిపోయింది. ఎప్పుడు కళకళలాడే  ఫార్ములా వన్‌ కూడా కరోనా దెబ్బతో వెలవెలబోయింది. మెరుపు వేగంతో దూసుకెళ్లే కార్లకు బ్రేకులు పడ్డాయ్‌.  ఇప్పుడిప్పుడే ఆంక్షల సడలింపులతో మళ్లీ క్రీడలు మొదలవుతున్నాయ్. ఎన్నో ఆటు పోట్లు తట్టుకుని ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చేలా మళ్లీ ప్రారంభమైంది ఫార్ములా వన్‌ రేస్‌.

 

మార్చి 13న ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి రూపంలో ఈ ఏడాది సీజన్‌ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా రేసు రద్దయింది. ఆ తర్వాత మళ్లీ మొదలు కాలేదు. ఇదొక్కటే కాదు వరుసగా పోటీలు రద్దవుతూ వచ్చాయి. ఒక దశలో ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌ప్రి అయినా జరుగుతుందా అనే అనుమానాలు రేకెత్తాయి. కానీ అంచనాలు తలకిందలు చేస్తూ ఎఫ్‌-1 వేగంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐరోపా రేసులను ఎనిమిదికి కుదించి ఈ ఏడాది షెడ్యూల్‌ను సవరించి కొత్త తేదీలను ప్రకటించింది. అనుకున్నట్లుగానే ఆస్ట్రియా గ్రాండ్ పిక్స్‌ రేస్ ఆరంభం అయింది.

 

ఆస్ట్రియా గ్రాండ్ పిక్స్ రేస్‌లో మొదటి రోజు ప్రాక్టీస్ రేసింగ్‌ను నిర్వహించారు. కరోనా జాగ్రత్తలన్నింటిని పాటిస్తూ ఈ ప్రాక్టీస్‌ను ఏర్పాటు చేశారు రేసింగ్‌ నిర్వహకులు.  కిలో మీటర్ల పొడువునా జెండాలూపుతూ తమ ఇష్టమైన రేసర్లను ప్రోత్సహించే అభిమానులు, భారీ సిబ్బంది ఈసారి కనిపించలేదు. అలాగే  షాంపైన్‌ సంబరాలు, హై ఫైలు కూడా స్వస్తి చెప్పారు. రెండో రోజు క్వాలిఫయింగ్‌, మూడో రోజు ఆదివారం ప్రధాన రేస్‌ జరగనుంది. వరుస ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో హ్యాట్రిక్‌ సాధించిన హమిల్టన్‌ ఈ సీజన్లోనూ ఛాంప్‌గా నిలిస్తే..ఏడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల ఆల్‌ టైమ్‌ రికార్డును సమం చేస్తాడు. సెప్టెంబరు 6న ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రితో ఈ రేసులకు తెరపడనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: