గ‌త కొద్దికాలంగా, స్వ‌దేశీ మంత్రం పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చైనాతో ఘ‌ర్ష‌ణ‌, స‌రిహ‌ద్దుల్లో మ‌న సైనికుల వీర‌మ‌ర‌ణం నేప‌థ్యంలో ఈ ప్ర‌స్తావ‌న తెర‌మీద‌కు వస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో బీజేపీ పెద్ద‌లైతే స్వ‌దేశీ మంత్రం జ‌పిస్తున్నారు. అయితే, తాజాగా బీజేపీ అంటే ఓ రేంజ్‌లో దూరం పెట్టే తెలంగాణ  రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

 

దేశంలోని అన్ని రంగాలపై కొవిడ్‌ ప్రభావం పడిందని మంత్రి కేటీఆర్ విశ్లేషించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఎక్స్‌కాన్‌ వంటి కార్యక్రమాలను సీఐఏ హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు. సవాళ్లు, అవకాశాలపై సీఐఏ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను సీఐఏ అభినందించింది. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సీఐఏకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీకి ప్రత్యేక పార్కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు, సాగునీటి ప్రాజెక్టులు సహా పలు నిర్మాణాలతో సీఐఏకు అవకాశాలు ఉన్నాయన్నారు. 

 


ఇదిలాఉండ‌గా, నాబార్డ్‌(వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు) సీజీఎం వై.కే.రావుతో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ప్రస్తుతం వస్తున్న వ్యవసాయోత్పత్తుల విప్లవం వలన రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని మంత్రి అన్నారు. కావునా ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు నాబార్డ్‌ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంతో తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలు కలుగుతుందన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయరంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: