ఏపీ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని ప్రవేశపెట్టింది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.

 

జగన్‌ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు శుభవార్త అందించింది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల పోలంలో ఉచితంగా బోర్లు వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్‌ రైతు భరోసా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నియోజకవర్గానికి ఒక బోరువెల్ మెషన్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టెండర్లు దాఖలు కాకపోవడంతో రేట్ కాంట్రాక్ట్ విధానంలో బోర్లు తవ్వకాలు చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. 

 

ఉచిత బోర్‌వెల్‌ సదుపాయం పోందటానికి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేసింది. దీని ప్రకారం రైతుకు కనీసం  రెండున్నర నుంచి  గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఈ నిబంధనలకు సరిపోయే విధంగా పక్క పక్క పోలాలు ఉన్న రైతులు కలిసి గ్రూపుగా కూడా ఏర్పడొచ్చు. అప్పటికే బోరు బావి వేసి ఉన్న పొలాలకు ఈ సదుపాయం వర్తించదు. అర్హులైన రైతులు పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇలా వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులను అనుమతి కోసం ఎంపీడీవోకు పంపిస్తారు. అక్కడి నుంచి ఉన్నతాధికారికి ఈ దరఖాస్తులు చేరతాయి. బోరు బావి మంజూరు సమాచారాన్ని లబ్దిదారులైన రైతులకు గ్రామ సచివాలయం ద్వారా తెలియజేస్తారు.

 

బోరు డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రోజియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు కానుంది. తవ్విన బోర్‌ బావులు అన్నింటిని జియో ట్యాగ్‌ చేస్తారు. తప్పనిసరి రెయిన్‌ హార్వెస్టింగ్‌, సోషల్‌ ఆడిటింగ్‌ వంటి నిబంధనలు ఉంటాయి. మరోవైపు భూగర్భ జల మట్టానికి సంబంధించి ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన ఒక వెయ్యీ 94 రెవెన్యూ గ్రామాలను ఈ పథకం నుంచి మినహాయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: