దేశంలో మహిళపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మత్తులో కొందరు అఘాయిత్యాలకు పాల్పడితే  మరి కొందరు అప్పు రూపంలో దారుణాలకు పాల్పడుతున్నారు. అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళ దారుణ హత్యకు గురైంది ఈ అమానుష ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే కదులుతున్న కారులోనే కిరాతకంగా ఆమె గొంతుకోసి హత్య చేశాడు దుర్మార్గుడు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఊరికి దూరంగా తీసుకెళ్లి కాల్వలో పడేసి చేతులు దులుపుకున్నాడు. తన భార్య కనిపించడం లేదంటూ మృతురాలి భర్త ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చిందన్నారు. 

 

 

నగరంలోని టోలీగంజ్ ప్రాంతానికి చెందిన మహిళ(45) ఇంటి పనులు చేసుకునేది. అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌తో పరిచయం కారణంగా అతనికి కొంత మొత్తం అప్పుగా ఇచ్చిందన్నారు. అవి తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడన్నారు. ఓ రోజు ఉదయం ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్తుండగా ఇద్దరి మధ్య డబ్బుల విషయమై తీవ్ర వాగ్వాదం జరిగిందన్నారు.

 

 

దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన డ్రైవర్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. కారులోనే ఆమె గొంతుకోసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని మాయం చేసేందుకు సిటీ చుట్టూ కారులో చక్కర్లు కొట్టాడు. చివరికి ఈస్ట్ మెట్రోపాలిటన్ బైపాస్‌లోని ఓ కాల్వలో పడేశాడు. రాత్రయినా తన భార్య ఇంటికి రాలేదంటూ మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

 

 

కారులో వెళ్లినట్లుగా సమాచారం రావడంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారుని గుర్తించారు. ఆ కారు మొబైల్ యాప్ ఆధారిత కారు సర్వీస్ కావడంతో వెంటనే కారుని ట్రేస్ చేశారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశాడు. అప్పుగా ఉన్న డబ్బులు తిరిగివ్వాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: