ఇప్పుడు దేశంలో క‌రోనా సోకని పట్టణం, నగరం లేదు. అయితే, హైద‌రాబాద్‌లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంద‌ని, ఊహించ‌ని రీతిలో కేసులు తెర‌మీద‌కు వ‌స్తుండ‌టం దీనికి నిద‌ర్శ‌న‌మంటున్నారు. అందుకే, పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌మ సొంతూళ్ల‌కు ప‌య‌నం అవుతున్నారు. అయితే, హైద‌రాబాద్ గురించి వ‌ర్రీ అయే అంత‌టి ప‌రిస్థితులు ఏవీ లేవంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌ జనాభా కోటిన్నర. ఇక్కడున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14 వేల లోపే. అంటే 0.1 శాతమే. వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే కరోనా సోకింది. ఇంత జనాభా నివసిస్తున్న నగరంలో అన్ని తక్కువ కేసులంటే సురక్షితం కాదని అనుకోవడం తప్పవుతుందని పేర్కొంటున్నారు. 

 

దేశంలోని అన్ని మెట్రోపాలిటన్‌ సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి చాలా చాలా తక్కువ అని పేర్కొంటున్నారు. హైద‌రాబాద్‌లో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. వైరస్‌ను జయిస్తున్నవారే అధికంగా ఉంటున్నారు. చికిత్స తీసుకుని బయటికి వచ్చి డాక్టర్లు, వారందించిన సేవలను పొగుడుతున్నారు. పైగా ఇక్కడ మరణాల రేటు తక్కువగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ నగర వాసులందరికీ జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది, వైద్యులు నిరంతరం సేవలందిస్తూనే ఉన్నారు. ఆపత్కాలంతో ఐకమత్యంగా ఉండి కరోనాను పారదోలుదామ‌ని, పుకార్లు సృష్టించుకొని మనకు మనమే నష్టం కలిగించుకోవద్దని సూచిస్తున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు దూరంగా ఉండొచ్చున‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. శాస్త్రీయ అవగాహన లేని వారు, సామాజిక అవగాహన లోపించిన వారు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు కాబ‌ట్టి వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

 

 

హైదరాబాద్‌ నుంచి ప్రజలు తరలివెళ్తున్నారనే ప్రచారం సరికాదని మ‌రికొంద‌రు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తున్నారనే ప్రచారంతో జరిగిన వలసలుగానే భావించాలి తప్ప కరోనా వ్యాప్తి కారణంగా జరిగిన వాటిగా భావించకూడదని అంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.  వయోవృద్ధులు, చిన్నారుల విషయంలో తప్పించి, మిగిలిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నారు. న‌గ‌రం నుంచి కొంత మంది వెళ్తున్నప్పటికీ, వీళ్ల ద్వారా వారి స్వస్థలాల్లో కూడా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందని హెచ్చ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: