తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించనున్నట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. 
 
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ విధించే యోచనలో లేదని సమాచారం. ఎక్కువమంది లాక్ డౌన్ ప్రతిపాదనలను వ్యతిరేకించటం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేసినా వైరస్ వ్యాప్తిని అరికట్టలేమని నిపుణులు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. 
 
లాక్ డౌన్ బదులు వైద్యం అవసరమైన వారందరికీ వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించినా ఆశించిన మేర ప్రయోజనం చేకూరదని.... అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి  కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. 
 
మరోవైపు వైద్య నిపుణులు డీ విటమిన్ లోపంతో బాధ పడుతున్న వారు కరోనా భారీన పడితే ఎక్కువగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. డీ విటమిన్ తక్కువగా ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుందని..... విటమిన్ సమృద్ధిగా ఉన్నవాళ్లు మాత్రం త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు. నగరవాసుల్లో దాదాపు 80 శాతం మంది డీ విటమిన్ లోపంతో బాధ పడుతూ ఉండటం గమనార్హం.       
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: