హైదరాబాద్ నగరంలో నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులకు కూడా వైరస్ వ్యాప్తిని ఎలా నియంత్రించాలో అర్థం కావడం లేదు. జూన్ ఒకటో తేదీన నమోదైన కేసులతో పోలిస్తే నిన్నటికి దాదాపు 20 రెట్ల కేసులు అధికంగా వస్తున్నాయి. 
 
గత 15 రోజుల నుంచి నగరంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛంధంగా లాక్ డౌన్ కు పిలుపునిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ నగరంలో 150 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించింది. కరోనా చికిత్స కొరకు టిమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పడకలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. కొన్ని కారణాల వల్ల నగరంలో ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. 
 
అన్ లాక్ 1.0 సడలింపుల తర్వాత నగరంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అన్ లాక్ 2.0 సడలింపుల అనంతరం వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కోటి మందికి పైగా జనాభా నివశించే నగరం కావడం, వ్యాపార... వాణిజ్య సంస్థలకు అనుమతులు ఇవ్వడం, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉండటంతో సడలింపుల అనంతరం నగరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. 
 
జూన్ ఒకటో తేదీ నాటికి పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి 17 రోజుల సమయం పట్టగా ప్రస్తుతం కేవలం 8 రోజుల సమయం మాత్రమే పడుతోంది. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని... అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు ప్రజలను మరింత టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో చేసిన పరీక్షల పరంగా చూస్తే 100 మందిలో 20 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ లెక్కలు ప్రజలను మరింత భయపెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: