కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ స్థాయిలో నమోదవుతున్న కేసులు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ భారీన పడుతున్నామని మరికొందరు చెబుతున్నారు. కరోనాపై పోరాటంలో వారియర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
తాజాగా కరోనా హైదరాబాద్ నగరానికి చెందిన మరో డాక్టర్‌ను బలి తీసుకుంది. జనరల్ ఫిజీషియన్ గా పని చేసే డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ వైరస్ భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. పేదల వైద్యునిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ సీతాఫల్‌మండీలో 1974లో శ్రీదేవి నర్సింగ్ హోం ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్నుకు చెందిన ప్రసాద్ 15 బెడ్లతో ఆస్పత్రిని ప్రారంభించి 150 పడకల స్థాయికి తీసుకొచ్చారు. 
 
సీతాఫల్‌మండిలోని వీరమాచనేని పగడయ్య ఉన్నత పాఠశాల వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రసాద్ ను నగరంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఆస్పత్రికి వెళ్లవద్దని ఆయన కుటుంబ సభ్యులు సూచనలు చేశారు. ఆయన మాత్రం పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవలు అందించారు. గత నెల 10వ తేదీన ఆయనలో వైరస్ లక్షణాలు కనిపించాయి. మూడు వారాలపాటు వైరస్‌తో పోరాడిన ప్రసాద్ చివరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
డాక్టర్ ప్రసాద్ పిల్లలు మీడియాతో మాట్లాడుతూ కరోనాతో పోరాడుతున్న ప్రస్తుత తరానికి తన తండ్రి ఆదర్శం అని అన్నారు. తన భద్రత సంగతి పట్టించుకోకుండా రోగులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆయన నిజమైన యోధుడని.... కరోనాతో పోరాడుతున్న యోధులందరికీ సెల్యూట్ చెబుతూ వైద్య వృత్తిలో ఉన్న ఆయన లాంటి వారు నిబద్ధతను, తమ అభిరుచిని చాటుకుంటున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: