తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా కల్లోలం నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి పది కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే, ఇది కేంద్రం నిర్ణ‌యం కంటే భిన్న‌మైన‌ది, గొప్ప‌ద‌ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్ల‌డించారు. 


కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి గ‌ల తేడాల‌ను  పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఈ మేర‌కు వివ‌రించారు. తెలంగాణ రాష్ట్రంలో 53.30 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 1.91 కోట్ల మందికి మాత్రమే ఉచితబియ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. కానీ రాష్ట్రంలోని 87.54 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని.. దీంతో మొత్తం 2.80 కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నదని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.216 కోట్లు ఖర్చుచేస్తూ 1.79 కోట్ల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నదని, ఇప్పుడు ఐదు నెలలపాటు ఉచిత బియ్యం కలుపుకొని 2.89 కోట్ల టన్నులు పంపిణీచేస్తామని వివరించారు. ఇందుకోసం ప్రతి నెలా రూ.50 కోట్ల చొప్పున ఐదు నెలలకు రూ.250 కోట్లు అదనంగా వెచ్చించినట్లు వెల్లడించారు. ఈ నెల నుంచి నవంబర్ ‌వరకు ఈ ఉచిత పంపిణీ కొనసాగుతుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 


ఆకలి దప్పుల తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కెసీఆర్‌ దక్కుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కోటి 50లక్షల ఎకరాల సాగు భూమికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 28వేల ఖాతాల రైతులకు రైతుబంధు సహాయం ఖాతాల వివరాలు సరిగ్గా లేనందున పంపిణీ చేసిన నగదు వాపస్‌ వచ్చిందని మంత్రి తెలిపారు. నాలుగో విడత రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు 55 లక్షల 6వేల మందికి  రైతుబంధు సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇతం పెద్ద మొత్తంలో రైతులకు ఆర్థిక స్వాబంలన కల్పించినందుకు రాష్ట్ర రైతాంగం తరుఫున సీఎం కెసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: