కరోనా మానవ జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మనిషులను బతికి ఉన్నప్పుడే అంటరాని వాళ్లను చేస్తోంది. హైదరాబాద్ లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఇల్లు ఉంటే చాలు.. దాని చుట్టూ కంచెలు వేసి.. సామాజికంగా బహిష్కరణ విధిస్తున్నట్టు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా తగ్గిపోయినా కొందరు వృద్ధులను ఇంటికి తీసుకెళ్లేందుకు సంబంధీకులు రాని పరిస్థితి నెలకొంది.


ఇక కరోనాతో చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా మృతదేహాలకు కనీసం అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగడం లేదు. కరోనాకు ముందు ఎవరైనా చనిపోతే.. ధనిక- పేద తేడా లేకుండా ఘనంగా అంత్యక్రియలు నిర్వహించేవాళ్లు.. చివరి చూపు కోసం బంధువులు పోటెత్తేవాళ్లు.. డప్పు మేళాలతో ఘనంగా వీడ్కోలు పలికేవాళ్లు. 


ఇప్పుడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు దారుణంగా జరుగుతున్నాయి. కరోనాతో ప్రాణం పోతే మృతదేహాన్ని కనీసం చూసేందుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులకు కూడా అవకాశం దక్కడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు కూడా పూర్తిగా జరగడం లేదన్న చేదు వాస్తవం వెలుగు చూసింది. మృతదేహాలను పూర్తిగా కాలకుండానే వదిలేస్తున్నారు.


దీంతో ఆ సగం కాలిన శవాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. గాంధీ ఆసుపత్రిలో కరోనాతో ఎవరైనా చనిపోతే ఆ శవాలను ఈఎస్‌ఐ పక్కన ఉన్న శ్మశాన వాటికలో దహనం చేస్తున్నారు. అయితే నిన్న ఓ వ్యక్తి ఆ శ్మశానంలో తన తాత అస్తికల కోసం వెళ్లాడు. అక్కడ సగం కాలిన కరోనా శవాలను కుక్కులు పీక్కుతినడం చూసి అవాక్కయ్యాడు. ఆ దృశ్యాలు తన కెమేరాలో బంధించి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: