కరోనా మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించని వారి విషయంలో కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాపించకుండా ఉండేందుకు అందరూ మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే చాలా మంది నిబంధనలను లెక్క చేయడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా సామాజిక వ్యాప్తి కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో కేరళ సర్కార్ అంటువ్యాధుల చట్టం కింద పలు నిబంధనలతో కూడిన ఓ ఆర్డినెన్స్‌ను అమలులోకి తెచ్చేంది. నిబంధనలను ఉల్లంఘిస్తే పదివేలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష విధించనున్నట్లు కీలక ప్రకటన చేసింది. 
 
పబ్లిక్ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో, సామూహికంగా ఉండే చోట మాస్క్ తప్పనిసరిగా ధరించాలని.... పబ్లిక్ ప్రదేశాల్లో, కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం పాటించాలని పేర్కొంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో 25 మందికి మించి ఉండకూడదని తెలిపింది. వివాహ వేడుకలకు 50కి మించి హాజరు కాకూడదని.... అక్కడ కూడా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలని పేర్కొంది. 
 
ర్యాలీలు, ధర్నాలలో 10 మందికి మించి పాల్గొనకూడదని... వీటి కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. రోడ్లు, ఫుట్‌ఫాత్‌లపై ఉమ్మివేయకూడదని.... రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ పోర్టల్ లో రిజిష్టర్ చేసుకున్న వాళ్లను మాత్రమే ఇతర ప్రదేశాల నుంచి కేరళకు అనుమతిస్తామని తెలిపింది. ఈ సంవత్సరం వరకు ఈ ఆర్డినెన్స్ అమలు కానుండగా పరిస్థితులకు అనుగుణంగా అందులో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం.                         

మరింత సమాచారం తెలుసుకోండి: