ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమై ఇప్పటికే దాదాపు అన్ని దేశాల నుంచి నిరసనలు, విమర్శ‌లు ఎదుర్కుంటున్న చైనాకు ఇంకా షాకులు కొన‌సాగుతున్నా. హాంగ్‌కాంగ్‌ను రాజకీయంగా హస్తగతం చేసుకొనేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలకు ఇంటా బయట వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దురాక్రమణ పర్వానికి పాల్పడుతూ సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో విర్రవీగుతున్న డ్రాగన్ గల్వాన్‌ లోయలో దుశ్చర్యకు పాల్పడి 20 మంది జవాన్ల మరణానికి కారణమైన చైనాపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా వైఖరిని విమర్శిస్తూ పలు దేశాలు భారత్‌కు మద్దతును తెలుపుతున్నాయి. డ్రాగన్‌ దుర్బుద్ధిని పసిగట్టి భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. చైనా చర్యలను జపాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు ఎండగట్టాయి. దౌత్యపరంగా చైనాను ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 

 

చైనా విష‌యంలో అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోమారు సైతం అదే రీతిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భారత సరిహద్దుల్లో చైనా కొనసాగిస్తున్న దురాక్రమణల పర్వం ఆ దేశ  అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నదని అమెరికా పేర్కొంది. ఇతర దేశాలపై కూడా డ్రాగన్‌ దేశం వైఖరి ఇలాగే ఉన్నదని ఆరోపించింది. చైనా యాప్‌లపై భారత్‌ విధించిన నిషేధం సరైనదేనన్నది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు అమెరికా చెక్‌ పెట్టింది. ఇందులోభాగంగా తన నౌకాదళానికి  చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లను, మరో నాలుగు వార్‌ షిప్‌లను అక్కడ మోహరించింది.  

 

మ‌రో ముఖ్య దేశ‌మైన ఫ్రాన్స్ సైతం భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. భారత సైనికులపై జరిగిన దాడి యావత్‌ భారతదేశంపై జరిగిన దాడిగా ఫ్రాన్స్‌ అభివర్ణించింది. చైనా సాగిస్తున్న కుట్రపూరిత చర్యలను తిప్పికొట్టేందుకు భారత్‌కు అండగా ఉంటామని తెలిపింది. భారత్‌ అభ్యర్థనమేరకు వీలైనంత త్వరగా రాఫెల్‌ యుద్ధ విమానాల్ని అందించి తగిన సాయం చేస్తామని భ‌రోసా ఇచ్చింది. మ‌రోవైపు హాంకాంగ్‌ తదితర అంశాల్లో చైనా దుందుడుకు చర్యలు సరైనవి కాదని, ఘర్షణలతో సమస్యలు పరిష్కారం కావని పరోక్షంగా భారత్‌కు బ్రిట‌న్‌ మద్దతు ప్రకటించింది. సామరస్యక పూర్వక వాతావరణంలో జరిగే చర్చలే వివాదాల్ని పరిష్కరిస్తాయని, భారత్‌-చైనా ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని బ్రిటన్‌ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: