తెలంగాణలో కరోనా కేసులు నిన్న రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత మూడు రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా నిన్న మాత్రం ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.  ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు అంటే 87.6 శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. 4,073 మందికి నెగటివ్‌గా నిర్ధారణ అయింది.  నిన్న ఒక్క రోజే 1,126 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ మహమ్మారిని నుంచి మొత్తం 10,195 మంది కోలుకోగా, తాజాగా 8 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 283కు పెరిగింది.

 

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,118 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  ఇక కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20 వేల మార్కును దాటేసి 20,462గా నమోదైంది. 9,984 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా ఎప్పటి నుంచి మొదలైందో.. అప్పటి నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎడతెరిపి లేకుండా శ్రమిస్తున్నారు.  ఇప్పుడు రక్షించే వారికి ముప్పు వచ్చింది. ఇటీవల కాలంలో వరుసగా పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా భారిన పడుతున్నారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ వైరస్ ఎటాక్ చేస్తూనే ఉంది.

 

తాజాగా   ఉమ్మడి పాలమూరు జిల్లాపై కొవిడ్‌-19 పంజా విసిరింది.  వనపర్తి జిల్లాలో ఓ మహిళ మృతిచెందగా.. మహబూబ్‌నగర్‌లో ఇటీవల చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎస్వీఎస్‌ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో మృతిచెందారు.  ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనూ కరోనా వైద్యులను వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు 10 మంది ప్రముఖ డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారి వద్దకు వైద్యానికి వెళ్లినవాళ్లకు, ఆ డాక్టర్ల దగ్గర పనిచేసే సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే వారంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: