తనిఖీలన్నీ గంగలో కలిశాయి. కేసులన్నీ అటకెక్కేశాయి.  రైతులను నట్టేట ముంచేందుకు నిషేధిత ఎరువులు మార్కెట్‌లోకి వచ్చేశాయి. మనుషులకే కాదు పక్షులకు, జలచరాల మనుగడకు ప్రమాదకరంగా మారిన క్రిమిసంహారక మందులు ఇప్పుడు మార్కెట్లో తిష్టా వేశాయి.   

 

భారత ప్రభుత్వం నిషేధించిన పలు హానికారక క్రిమిసంహారక మందులు తెలంగాణలో ఎక్కడపడితే అక్కడ విరివిగా లభ్యమవుతున్నాయి.  దేశవ్యాప్తంగా 12 రకాల క్రిమిసంహారక మందులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమిసంహారక చట్టం 1968 ప్రకారం ఈ ఎరువులు తయారే చేసినా, దిగుమతులు చేసినా, విక్రయించినా చట్టరీత్యా నేరం. మరో 6 రకాల పురుగుల మందులపై కూడా 2020 డిసెంబరు 31 తర్వాత నిషేధం విధిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

 

దేశంలో మొత్తం 66 బ్రాండ్‌ల క్రిమిసంహారక మందుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ తేనెటీగలు, పక్షులు, జలచరాల మనుగడ పాలిట ముప్పుగా మారాయని ఓ వ్యవసాయ కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూగర్భ జలాల్లో ఈ పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని,  మనుషులు, ఇతర జీవరాసుల పాలిట ఇవి ప్రమాదకరంగా మారాయని అంటూ పిటిషన్‌ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో 2013లో అప్పటి ప్రభుత్వం ప్రొఫెసర్‌ అనుపమ్‌ వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ దేశంలో చలామణి అవుతున్న 66 క్రిమిసంహారక మందుల వాడకం, వాటి పర్యావసానలపై అధ్యయనం చేసింది. ఇందులో 18 బ్రాండ్లను పూర్తిగా నిషేధించాలని,  మరో 18 బ్రాండ్లపై ఇతర దేశాల్లో నిషేధం ఉన్నా భారత్‌లో కొనసాగించవచ్చని  నివేదిక ఇచ్చింది. ఇంకో 27 బ్రాండ్లను పునఃసమీక్షించాల్సి ఉందని నివేదికలో పేర్కొంది.  మిగిలినవాటిలో రెండింటిపై అప్పటికే నిషేధం ఉంది. మరో క్రిమిసంహారక మందు ఎండోసల్ఫాన్‌ తమ చట్టపరిధిలోకి రాదని పేర్కొంది కమిటీ.  2015లో కేంద్రానికి పూర్తి నివేదిక ఇచ్చింది కమిటీ.  దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్రం.. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 12 మందులపై నిషేధం విధించింది.

 

తాజాగా తెలంగాణలో నిషేధిత క్రిమిసంహారక మందులు, కలుపు మందుల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతుండటం కలకలం రేపుతున్నాయి. భూసారాన్ని దెబ్బతీసి, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించే గ్లైఫోసేట్ మందుపై నిషేధం ఉంది. కాని గుట్టుచప్పుడు కాకుండా గ్లెఫోసెట్‌ అమ్మకాలు సాగుతున్నాయి. కలుపు మందు పేరుతో కొందరు అక్రమార్కులు గ్లైఫోసేట్ సేల్స్ చేస్తున్నారు. రైతులు కలుపు తీసే అవసరం ఉండదనే ఆలోచనలో దళారులను నమ్మి గ్లైఫోసేట్‌ మందు వాడుతున్నారు. 

 

కిందిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ దందా కొనసాగుతోంది. కేన్సర్‌ కారకమని ప్రపంచవ్యాప్తంగా గ్లైఫోసేట్‌ మందులను నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య నిషేధం విధించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: