హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న వారిలో మెజార్టీ ప్ర‌జ‌లు ఎదుర్కునే స‌మ‌స్య ప‌బ్లిక్ టాయిలెట్లు లేక‌పోవ‌డం. న‌గ‌రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప‌బ్లిక్ టాయిలెట్లు లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న క‌ష్టాలు వ‌ర్ణణాతీతం. వివిధ పనుల నిమిత్తం బయట సంచరిస్తున్న ప్రజల కనీస అవసరం తీర్చుకునేందుకు చుట్టు పక్కల చూడాల్సిన ధీన‌మైన ప‌రిస్థితి. టాయిలెట్ల నిర్మాణం గురించి కోర్టులు మొట్టికాయ‌లు వేసినా...ప్రభుత్వాలు, అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో నగరంలో పబ్లిక్‌ టాయిలెట్ల సమస్య తీవ్రమైంది. ప్రతిసారీ స్థలాల లభ్యత లేదంటూ తప్పించుకునేవారు. అయితే, దీనికి ఓ ప‌రిష్కారం దొరుకుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా 140 పబ్లిక్‌ టాయిలెట్లు సిద్ధమయ్యాయి. మరో 237 చోట్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల ప్రకారం వచ్చే ఆగస్టు 15వ తేదీలోగా ఒక్కో జోన్‌లో 500చొప్పున, ఆరు జోన్లలో 3 వేల టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్ల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. జంక్షన్లు, ప్రధాన రోడ్లు, పార్కుల ప్రహరీల వెంబడి కొత్తగా 3వేల టాయిలెట్లను బీఓటీ(బిల్డ్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో నిర్మించారు. ఆగస్టు 15లోపు ప్రతి జోన్‌లో 500 చొప్పున మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌ తదితర జోన్లలో 500 చొప్పున టాయిలెట్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించారు. సికింద్రాబాద్‌ జోన్‌లో 229 ప్రదేశాలను గుర్తించారు. మొత్తం 2729 ప్రదేశాలను ఎంపిక చేయగా, సికింద్రాబాద్‌ జోన్‌లో మరో 271 స్థలాలను త్వరలోనే గుర్తిస్తామని అధికారులు అంటున్నారు. స్థలాల లభ్యత ఉన్నచోట ఇప్పటివరకు 140 టాయిలెట్ల నిర్మాణం పూర్తికాగా, మరో 237 చోట్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశిత లక్ష్యం ప్రకారం నిర్మాణం పూర్తి చేయాలని, రోజూ పనులను పర్యవేక్షించాలని జోనల్‌ కమిషనర్లను కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఆదేశించారు.

నగరంలో జోన్‌కు 500 చొప్పున 3000 టాయిలెట్లు నిర్మించాలని పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు ఇటీవలే జీహెచ్‌ఎంసీ అధికారులకు లక్ష్యాన్ని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆయా టాయిలెట్ల నమూనాలను పరిశీలించిన అరవింద్‌కుమార్‌ సాధ్యమైనంత వరకు త్వరగా స్థలాల ఎంపిక పూర్తిచేసి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నిర్మించే టాయిలెట్ల నమూనాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. అనంత‌రం త‌దుప‌రి ప్ర‌క్రియ‌లు సాగుతున్నాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: