ఇప్పుడు అంద‌రి దృష్టి క‌రోనా గురించే. ఆ మ‌మ‌మ్మారి విస్త‌రిస్తున్న తీరు, అది మ‌నుషుల‌ను క‌బ‌ళిస్తున్న విధానం గురించి ప్ర‌జ‌లు క‌ల‌వ‌రం చెందుతున్నారు. ప్ర‌ధానంగా తెలుగువారు ఎక్కువ‌గా జీవించే హైద‌రాబాద్‌లో ఈ మ‌హ‌మ్మారి విస్తృతి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ల‌క్ష‌లాది మ‌న‌వాళ్ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అయితే, తాజాగా ఓ సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే విటమిన్‌ డి లోపం ఉన్నవారే ఎక్కువగా కొవిడ్‌ వైరస్‌ బారినపడుతున్నారట‌, అలాగే మృతుల్లోనూ  ఈ విటమిన్‌ లోపం ఉన్నవారే అధికంగా ఉంటున్నారని నిపుణులు తేల్చుతున్నారు.

 


గ్రేట‌ర్ హైద‌రాబాద్ వాసుల్లో డి-విటమిన్‌ లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు పేర్కొన‌డం వెనుక స‌రైన వైద్య సంబంధ‌మైన కార‌ణాలే ఉన్నాయి. సాధారణంగా రోగిలో ఏదైన వైరస్‌ సోకినప్పుడు సైటోకీన్స్‌ అనేవి సైనికుల్లా పనిచేసి శరీరంలోకి వచ్చిన శత్రువుల్లాంటి వైరస్‌లపై దాడిచేసి వాటిని నశింపచేస్తాయి. కానీ విటమిన్‌ డి లోపం ఉన్నవారిలో రోగిని వైరస్‌ నుంచి కాపాడాల్సిన ఈ సైటోకీన్సే ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూలకణాలను దెబ్బతీస్తాయి. దాని వల్ల రోగిలో రక్త కణాలు దెబ్బతిని గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు విఫలమవుతాయి. ఇది జరగకుండా సైటోకీన్స్‌ అనేవి సక్రమంగా పనిచేయాలంటే  విటమిన్‌ డి అవసరం. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే విటమిన్‌ డి లోపం ఉన్నవారే ఎక్కువగా కొవిడ్‌ వైరస్‌ బారినపడుతున్నారు. అలాగే మృతుల్లోనూ  ఈ విటమిన్‌ లోపం ఉన్నవారే అధికంగా ఉంటున్నారు. ఈ విటమిన్‌ సమృద్ధిగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు.

 

కాగా, సూర్యరశ్మి తగలకుండా ఇండ్లు, కార్యాలయాలకే పరిమితమయ్యే నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్‌ లోపం ఉంటుందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. కనీసం అరగంట  ఎండలో ఉంటే సహజంగా విట‌మిన్ డి లభిస్తుంది. సూర్య కిరణాలతో పాటు చేపలు, గుడ్లు, వెన్న, పాలు తదితర వాటిలో ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. లోపం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుడి సలహా మేరకు తక్కువ డోస్‌లో కొంత కాలం పాటు విటమిన్‌ డి  మాత్రలను వినియోగించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: