ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాల ప్రాధాన్యత మరియు సత్తా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర రాజకీయాలు మొత్తం దాదాపుగా కులాల చుట్టూనే తిరుగుతుంటాయి అన్నది అక్షర సత్యం. రెడ్డి వర్సెస్ కమ్మ ప్రధాన పోటీగా… మధ్యలో అవకాశవాదులు చేసే కాపు రాజకీయంతో పాటు బిసి, దళితులను సమయానుకూలంగా వాడుకుంటూ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరియు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో తగినంత డ్యామేజ్ చేయడమే ప్రధాన కర్తవ్యంగా బ్రతికే రాజకీయ నాయకులను కొన్ని వందల మందిని చూశాం. ఇందులో మనం ప్రేక్షక పాత్ర పోషించింది తప్ప పెద్దగా చేసింది ఏమీ లేదనుకోండి. ఇప్పుడూ అదే చేద్దాం పదండి....

 


మ్యాటర్ ఏమిటో చెప్పే ముందు ఒక్క వివరణ…! కరోనా వైరస్ కు మాత్రం ఎటువంటి కులపిచ్చి లేదు. దొరికిన వాడి మీదకు దొరికినట్టు పంజా విసురుతుంది. అదృష్టం బాగుంటే బతికి బట్ట కడతాడు. దరిద్రం దాపురిస్తే మాత్రం దుకాణం సర్దేస్తాడు. ఇటువంటి అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది అన్న వార్త బయటకు వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ 'భారత్ బయోటెక్' నుండి ఆగస్టు 15 నాటికి తీసుకొచ్చేలా ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ తో కలిసి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇంకేముంది మళ్లీ మనం పాత రొటీన్ లోకి ఎంటర్ అయిపోదాం అని అందరూ అనుకుంటున్న సమయంలోనే ఇక్కడ కరోనాని మించిన మహమ్మారి అయిన 'కులం' ప్రవేశించింది.

 


కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నెటిజన్లు (ప్రధానంగా టిడిపి మద్దతుదారులు) సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చలోక్తులు విసురుతూ ఉన్నారు. భారత్ బయోటెక్ అనేది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్థాపించిన కంపెనీ అని.... దాని నుండి వస్తున్న వ్యాక్సినే ఈ  కరోనా వ్యాక్సిన్ అని జబ్బలు చరచుకోడం మొదలుపెట్టారు. ఇక మీకు 'కమ్మ' అన్న పదమే గిట్టదు కదా మరి ఈ వ్యాక్సిన్ ను కూడా వద్దంటారా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన.... అధికారి వైఎస్ఆర్సిపి పైన సెటైర్లు వేస్తున్నారు సదరు టిడిపి మద్దతుదారులు.

 

 

ఇక ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వ్యాక్సిన్ తయారీ మరియు విడుదల విషయంలో ఎవరికీ ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఆగస్టు 15 నాటికి దాదాపు వచ్చేస్తుంది అని ఐసీఎంఆర్ ప్రకటించినా.... దానికి ఇంకా చాలా సమయం పడుతుందని భారత్ బయోటెక్ సంస్థ వర్గాలు చెప్పాయి. ఈ లోపలే టిడిపిలో ఉన్న కొంతమంది కమ్మ బ్యాచ్ ఈ క్రెడిట్ అంతా మాదే అని పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక కరోనా వైరస్ అయినా 10 రోజులకు తగ్గిపోయే అవకాశం ఉంది లేదా 4 వారాలు  పీడించి వదిలిపెట్టే స్వభావం కలది. కానీ మన కుల పిచ్చి అలా కాదుగా. ఒకరి నుంచి మరొకరికి ఒక వైరస్ కన్నా సులువుగా ఊరికే అంటుకుంటుంది. అంతే… ఆ బీరాలు పలికిన కమ్మ వారిని టార్గెట్ చేస్తూ మిగతా సామాజికవర్గాలకి చెందిన అధికార పార్టీ మద్దతుదారులు అయిన రెడ్డి మరియు కాపు బ్యాచ్ కూడా ఏ మాత్రం పరిస్థితి పైన కనీస అవగాహన మరియు విచక్షణ లేకుండా తిట్లదండకం ప్రారంభించేసుకున్నారు.

 


ఇప్పుడు మనం ఈ 21వ శతాబ్దానికి వచ్చేశాం. కంటికి కనిపించని ఒక క్రిమి వచ్చి నీ ఆస్తి, అంతస్తు, స్థాయి, పరపతి, కులం, గోత్రం, వృత్తి, హోదా, డబ్బు, పదవి ఏమీ చూడకుండా అసలు నువ్వు ఎవడైతే నాకేంటి అని దాదాపు 100 రోజుల నుండి ఈ భూగర్భం పైన అత్యంత మేధావిని విర్రవీగే నిన్ను ఫుట్ బాల్ ఆడుకుంటుంటే నువ్వు మాత్రం ఈ సమయంలో నీకు ఏకైక తోడుగా నిలవగల సాటివాడిని ఎందుకు ద్వేషిస్తున్నాను.... ఎందుకు కించపరుస్తున్నాను.... అసలిలా ఎలా బాధపెడుతున్నాను అనే ఆలోచనలను రానివ్వకుండా విచక్షణారహితంగా ప్రవర్తించడం…. ఒరేయ్ మానవా.. ఇది నీకే చెల్లిందిరా..! శభాష్..!

 


అవును.. ముందు మిమ్మల్ని ప్రేక్షకులు అన్నాను కదా…! క్షమించండి… మీరే దీనికి అసలైన బాధ్యులు..!

ఇలా తరతరాలుగా నరాల్లో ఇంకిపోయిన ఈ కుసంస్కృతిని ఇప్పటికీ మార్చుకోకపోతే...

 


రేపటికి రేపే కరోనా వ్యాక్సిన్ 'రెడ్డీ' అయినా లాభం లేదు..!

 

నిజమైన భవిష్యత్తలో అసలు 'కమ్మ'దనం ఆస్వాదించే అవకాశం రాదు..!

 

కులం అనే మహమ్మారి నుండి 'కాపు' కాసే పరిజ్ఞానం ఏ శాస్త్రవేత్తకూ అబ్బదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: