జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేస్తున్న అడుగులు ఇప్పుడు సొంత పార్టీ నాయకుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. సినిమా హీరో గా కోట్లాది మంది అభిమానులు పవన్ ను ఆరాధిస్తారు. ఆ ధైర్యంతోనే 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జనసేన పార్టీ పేరుతో జనాల ముందుకు వచ్చినా, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా అనుకున్నా, జనసేన అధికారం కోసం రాలేదని, ప్రశ్నించడానికి పార్టీ పెట్టానంటూ, పవన్ అప్పట్లో గొప్పగా చెప్పారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అనుభవాలు, వెన్నుపోట్లు అన్ని పవన్ దగ్గరుండి చూసారు. తన అన్న అమాయకుడు కాబట్టి అధికారంలోకి రాలేక పోయారని, ఎంతోమంది వెన్నుపోటు పొడవగలరని, చాలా ఆవేశంతో అప్పట్లో ప్రసంగాలు చేశారు తాను అటువంటి తప్పులేమీ చేయబోనని, ప్రజారాజ్యంలో వెన్నుపోటు పొడిచిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటూ  సవాలు చేశారు.

IHG

కానీ 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదు. బిజెపి, టిడిపి కూటమికి మద్దతు ఇవ్వడమే కాకుండా, ఆ పార్టీల తరుపున ప్రచారానికి కూడా దిగి, ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు తన వంతు సహాయం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చేశారు. పోనీ ఆ తర్వాత అయినా, పార్టీని బలోపేతం చేసుకున్నారా అంటే అది చేయలేదు. అయిదేళ్లపాటు టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. అప్పట్లో వైసిపి ప్రతిపక్షంలో ఉన్నా, ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం, అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను ఎక్కడా, హైలెట్ చేయకుండా మౌనంగా ఉండిపోవడం, ఈ పరిణామాలన్నీ పవన్ పై అనుమానం కలిగేలా చేశాయి. ఇక 2019 ఎన్నికల నాటికి కూడా పవన్ పార్టీని బలోపేతం చేసుకోవడంలో విఫలం అయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి తాను రెండు చోట్ల ఓడిపోవడమే కాకుండా, కేవలం ఒకే ఒక్క స్థానం లో పార్టీ అభ్యర్థి గెలిచారు. పోనీలే ఇప్పటికైనా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై పవన్ దృష్టి పెడుతున్నారా అంటే ఇప్పటికీ ఆ పని చేయడం లేదు. 

IHG

కొద్ది నెలల్లో అయినా స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా, పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉంది. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, పొత్తు లేనట్టుగానే బిజెపి జనసేన తో వ్యవహరస్తూ వస్తోంది. పోనీ 2024 ఎన్నికలకైనా సిద్ధమవుతున్నారా అంటే ఆ దిశగా అడుగు పడకపోవడం, అసలు కరోనా ఈ స్థాయిలో ఏపీలో విజృంభిస్తున్న సమయంలో పవన్ హైదరాబాద్ కే పరిమితం అయిపోవడం, ఏపీ లో ఎన్నో రాజకీయ సంచలనాలు చోటుచేసుకుంటున్నా,  పవన్ క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగేందుకు ప్రయత్నించకపోవడం ఇవన్నీ జనసైనికులను   అసహనానికి గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: