భాగ్యనగరం.. ఎందరినో అక్కున చేర్చుకున్న మహానగరం.. పేదా, ధనిక అందరికీ ఆవాసం కల్పిస్తోంది. అయితే ఈ మహానగరంలో వైద్యం చాలా ఖర్చుతో కూడుకుంది. పేదింట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే.. సర్కారు దవాఖానాకు వెళ్లడం ఇష్టం లేకపోతే.. ఇక ఆ కుటుంబం పొదుపు చేసుకున్న డబ్బులన్నీ ప్రైవేటు ఆసుపత్రులకు ధారపోయాల్సిందే. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు సర్కారీ వైద్యాన్ని పటిష్టం చేస్తోంది. 

 


ఇప్పటికే పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 160కు పైగా బస్తీ దవాఖానాలు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటి సంఖ్యను త్వరలోనే 200కు పెంచుతున్నామని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌ ప్రకటించారు. ఈ దవాఖానాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బందిని నియ‌మించి కాల‌నీవాసుల‌కు ప్రాథ‌మిక వైద్య సేవ‌ల‌ను అందిస్తారు. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌లు ఎక్కువ‌గా ఉండే కాల‌నీలు, బ‌స్తీల‌కు ప్రభుత్వం వైద్యాన్ని చేరువ చేసేందుకు బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 

 


2019లో ఈ బస్తీ దవాఖానాల కాన్సెప్టుకు శ్రీకారం చుట్టారు. వీటి ఏర్పాటుకు స్ఫూర్తి దిల్లీలోని కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన క్లినిక్‌లు. మొదట్లో జీహెచ్‌ఎంసీలో 123 బ‌స్తీ ద‌వాఖానాల‌ు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2020 మే 22న మ‌రో 44 బ‌స్తీ ద‌వాఖానాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.  జీహెచ్చఎంసీ పరిధిలో ప్రతి వార్డుకు క‌నీసం రెండు చొప్పున బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే మ‌రో 33 బ‌స్తీ ద‌వాఖానాలను ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. 

 


ఈ కొత్త బస్తీ దవాఖానాలు కూడా అందుబాటులోకి వస్తే.. మొత్తం 200 వరకూ భాగ్యనగరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు అయినట్టు అవుతుంది. పేదలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా తక్కువే. ఇలాంటి ఆసుపత్రులు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: