ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోన్న కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా ప్రస్తుతం అప్పటికంటే నాలుగు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు కేంద్రం చేస్తున్న కొన్ని తప్పుల వల్లే ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు విధించినా ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం విషయంలో అన్ లాక్ 1.0కు ముందులా కఠినంగా వ్యవహరించడం లేదు. దేశంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరవడానికి అనుమతులు ఇవ్వడంతో రోడ్లపై జనసంచారం భారీగా పెరుగుతోంది. అయితే పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు నిబంధనలు సరిగ్గా పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
దేశంలోని పలు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వల్ల హోం ఐసోలేషన్ లో ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. అయితే హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లు కొంచెం నిర్లక్ష్యం వహించినా వాళ్ల నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యధిక కేసుల జాబితాలో అతి త్వరలో భారత్ మూడవ స్థానానికి చేరనుంది. దేశంలో గంటకు 1000కు పైగా నమోదవుతున్న కేసులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. 
 
మొదట్లో తక్కువగా కేసులు నమోదైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల వల్ల వైరస్ వ్యాప్తి దాదాపు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు అనిపిస్తోందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెబుతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా తమిళనాడులో 1,11,000 కేసులు, ఢిల్లీలో 97,200 కేసులు నమోదయ్యాయి.                     

మరింత సమాచారం తెలుసుకోండి: