జగన్ అనుకుంటే జరగాల్సిందే. ఆ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఇది ఏడాదిగా పాలనలో చూస్తున్న విషయమే. ఇపుడు కూడా అదే జరుగుతోంది. ఆ దిశగానే అడుగులు వేగంగా పడుతున్నాయి. దానికి తగిన కార్యాచరణ కూడా సిధ్ధం చేసి ఉంచారు. సరైన ముహూర్తం చూసి శ్రీకారం చుట్టేయడమేనని అంటున్నారు.

 

ఇంతకీ జగన్ ఏమనుకుంటున్నారు. ఏంటి జరుగుతుంది అన్నది ఇక్కడ పాయింట్. విశాఖను పాలనారాజధాని చేయాలన్నది జగన్ గట్టి పట్టుదల ఆ విషయంలో చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ గత ఆరు నెలలుగా అనేక అవరోధాలు స్రుష్టిస్తోంది. అయినా సరే జగన్ తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి చేయాల్సినది అంతా చేస్తున్నారు.

 

ఇపుడు జగన్ సర్కార్  విశాఖ రాజధాని విషయంలో అడుగులు వేగంగా పడుతున్నాయని అంటున్నారు. ఈ నెల 17 నాటికి రెండవ సారి కూడా శాసనమండలికి పంపించిన అధికార వికేంద్రీకరణ బిల్లు గడువు నెల రోజులు ముగుస్తుంది. దాంతో బిల్ ఆటోమేటిక్ గా మండలి ఆమోదం పొందినట్లుగానే భావించాలి. దాంతో ఆ బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపించి చట్టాలుగా తీసుకువచ్చేందుకు జగన్ సర్కార్ తగిన ఏర్పాట్లతో సిధ్ధంగా ఉంది.

 

మరో వైపు హఠాత్తుగా విశాఖ వచ్చిన డీజీపీ గౌతం సవాంగ్ రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేశారు. విశాఖ రాజధాని తరలింపు నేపధ్యంలో డీజీపీ పర్యటన పూర్తి ఆసక్తిగా సాగింది. ఆయన ప్రభుత్వ ఖాళీ  స్థలాలను పరిశీలించారు. అలాగే అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. మొత్తానికి ప్రభుత్వం ఎపుడు చెబితే అపుడు విశాఖ రావడానికి మేము రెడీ అని డీజీపీ క్లారిటీగా చెప్పేశారు.

 

అంటే రాజధానిగా విశాఖకు మంచి ముహూర్తం చూసి ప్రభుత్వం ప్రకటన చేస్తే చాలు తరలింపు అన్నది లాంఛ‌నం అని తేలుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మరో పది రోజుల్లో మొదలవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అప్పటికి శ్రావణ మాసం ఎంటర్ కావడంతో మంచి నెల కావడంతో తరలింపుని మొదలుపెట్టినట్లైతే  అక్టోబర్ 25న అంటే విజయదశమి వేళ పూర్తి స్థాయి రాజధాని విశాఖకు వస్తుందని చెబుతున్నారు. మొత్తానికి జగన్ అనుకున్నట్లుగానే అంతా జరుగుతోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: