మన దేశంలో కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు చెదిరిపోతున్నాయి. కొత్త రికార్డులతో వరల్డ్‌ ట్యాలీలో మూడో స్థానానికి చేరింది భారత్.  రికార్డుల స్థాయిలో కేసుల పెరగుతుండటంతో జనాలు భయపడుతున్నారు.

 

కరోనా మహమ్మారి భారతదేశాన్ని కబళిస్తోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు.. భయపెడుతున్నాయి.  నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు వైరస్ కేసుల్లో  భారత్ రష్యాను దాటిపోయింది. ప్రపంచంలో మూడో స్థానానికి చేరింది. వివిధ రాష్ట్రాలు  ప్రకటించిన లెక్కలతో భారత్‌లో మొత్తం  కేసుల సంఖ్య 6 లక్షల 90 వేలకు చేరింది. రష్యాలో 6 లక్షల 80 వేల మంది బాధితులున్నారు.  భారత్ కంటే ముందు రెండో స్థానంలో బ్రెజిల్, మొదటి స్థానంలో అమెరికా ఉన్నాయి.


 
గడచిన 24 గంటల్లోనే దాదాపు 25వేల కేసులు నమోదు కాగా..... 613 మంది బలయ్యారు. దేశ‌వ్యాప్తంగా ఒక్కరోజులో ఈ స్థాయిలో కరోనా మ‌ర‌ణాలు, కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల73వేల 165కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల 19వేల 268మంది చనిపోయినట్టు తెలిపింది.

 

ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం.. ఊరట కలిగించే విషయం. ఇప్పటి వరకూ డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య.. 4లక్షలు దాటింది. ప్రస్తుతం 2లక్షల 44వేల 814మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లోనే దేశ‌వ్యాప్తంగా దాదాపు 15వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతంగా ఉండ‌గా మ‌ర‌ణాల రేటు 2.9శాతంగా ఉంది.


‌ 
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఢిల్లీలో కేసుల సంఖ్య లక్షకు చేరువైంది.  మరోవైపు కేరళ రాజధాని తిరువనంతపురంలో కేసుల పెరుగుతుండటంతో ఈ రోజు నుంచి నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. నిత్యావసర సరకుల నుంచి ఇంటి వద్దకే సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: