భారతదేశం. జగద్గురువు. ఒకనాడు ఇక్కడ నుంచే ప్రపంచం  మేధస్సుని అందుకుంది. సాహసాన్ని సంతరించుకుంది. వేదాలు, వైద్యం అన్నీ కూడా భారత్ చలవే. ఎలా బతకాలో భారత్ చెప్పింది. ఎలా బతకకూడదో భారతే చెప్పింది. భారత్ పుట్టేసరికి లేని దేశాలు ఇపుడు అగ్ర రాజ్యాలు. ఇవన్నీ ఇలా ఉంటే భారత్ ఇపుడు పోటీ వారితోనే  పడుతోంది.

 

అన్ని దేశాలతో పోటీ పడుతోంది. దేనిలో వెనక నుంచి  వరసగా పోటీ పడుతోంది. ప్రగతి లో వెనక బెంచ్ భారత్ ఉంది. అవినీతిలో ముందు వరసలో ఉంది. నిరుద్యోగంలొ, ఆకలిచావుల్లో కూడా ముందే ఉంది. ఇవన్నీ భారత్ కి ఆధునిక సమాజంలో అవార్డులు. మరి దీనికి తోడుగా మరో రికార్డు కూడా భారత్ సొంతం అయ్యేలా ఉంది.

 

కాదు మనకు మనమే దాన్ని అందుకోవడానికి ఉబలాటపడుతున్నాం. అదే చెత్త రికార్డు. కరోనా కేసుల్లో అగ్ర స్థానానికి భారత్ దూసుకువస్తోంది. కరోనా అన్న మాట భారత్ విన్న తొలి నాళ్లలో ఏ ఇరవయ్యే స్థానంలో ఉండేది. లాక్ డౌన్ మే నేల చివరలో సడలించారు. అంతే కేవలం నెలన్నర రోజుల్లోనే భారత్ దూకుడు అలా ఇలా లేదు. జోరెత్తింది. వెల్లువలా రెచ్చిపోతోంది.

 

అది ఎక్కడా ఆగడంలేదు. పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులు తనకు తానే క్రియేట్ చేసుకుంటూ వేగంగా వెళ్ళి ఆ చెత్త రికార్డు అందుకోవాలని, అమెరికాను సైతం మొదటి స్థానం నుంచి తోసేయడానికి ఉబలాటపడుతోంది. అదే కనుక జరిగితే భారత్ కి తలవంపులే. కానీ తప్పదులా ఉంది.

 

దేశంలో ఆకలి, అమాయకత్వం, మూర్ఖత్వం భారత్ ని ఇలా నడిపిస్తున్నాయి. లాక్ డౌన్ చేసిన తరువాత ఒక్క నెల రోజుల పాటు అయినా దేశాన్ని  జనాలను పోషించలేని  పాలకులు ఓ వైపు ఉన్నారు. ఆకలిని తట్టుకోలేక పొట్ట చేతబట్టుకుని వస్తున్న జనం మరో వైపు ఉన్నారు. వారిలో అమాయకత్వం ఉంది. మొండిగా వాదించే మూర్ఖత్వం ఉంది. అన్నీ కలసి భారత్ కి అగ్ర కిరీటాన్ని అప్పగిస్తున్నాయి. ఇది నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: