తెలంగాణ‌లో క‌రోనా కేసుల ఉధృతి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో కేవ‌లం ప్రైవేటు సంస్థ‌ల్లో మాత్ర‌మే చికిత్స‌కు అనుమ‌తించిన ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున న‌మోద అవుతున్న కేసుల‌తో ప్రైవేటు వారికి సైతం చాన్సిచ్చింది. అయితే, తాజాగా ప్రైవేటు ఆస్ప‌త్రుల విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌ల‌కు తెలంగాణ స‌ర్కారు సిద్ధ‌మ‌వుతున్నట్లు స‌మాచారం. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స అందించేందుకు మరిన్ని బెడ్లను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌)ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ప్రైవేటు దవాఖానలోనూ ప్రత్యేక బెడ్లకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కేసుల విషయంలో ప్రైవేట్‌ దవాఖానలు లాభాపేక్ష లేకుండా సేవాభావంతో వ్యవహరించాలని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. ప్రైవేట్‌ ల్యాబొరేటరీలు నిక్కచ్చిగా పరీక్షలు నిర్వహించాలని, కరోనా రోగులకు బెడ్లు కేటాయించని దవాఖానలపై చర్యలు కూడా తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. 

 

బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులు, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ యాజమాన్యాలతో విడివిడిగా భేటీ అయ్యారు. అనంతరం వైద్యశాఖాధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సత్వర వైద్యం, పరీక్షల నిర్వహణ, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ విధానం ద్వారా వైరస్‌ కట్టడి చేయాలని నిర్ణయించారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పాజిటివ్‌ వచ్చినవారికి తక్షణం వైద్యం అందించేలా దవాఖానలను సిద్ధం చేస్తున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ కసరత్తు చేశారు. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి ఇంటివద్దే వైద్యమందించడంతోపాటు, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌ చేయడం, వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారిని నిత్యం పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

 

 

కరోనా కేసుల విషయంలో ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు లాభాపేక్ష లేకుండా సేవాభావంతో వ్యవహరించాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. కొన్ని ప్రైవేట్‌ ల్యాబోరేటరీల్లో నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు వెలువడిన నేపథ్యంలో నిక్కచ్చిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. క‌రోనా పేషంట్ల కోసం ప్రత్యేకంగా బెడ్లు కేటాయించాలని ఆయా దవాఖానల యజమాన్యాలను మంత్రి ఈటల ఆదేశించారు. బెడ్లు కేటాయించని దవాఖానలపై చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంకంటే ప్రజలు బయట తిరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ ను మరికొంతకాలం కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రైవేటు దవాఖానల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు, పాజిటివ్‌ వచ్చినవారికి వైద్యమందించాలని స్పష్టంచేసినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: