హైద‌రాబాద్‌లో క‌రోనా కేసులు ఓ  రేంజ్‌లో పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కరోనా పడగ విప్పుతోంది. కోరలు చాస్తూ.. విలయతాండవం చేస్తోంది. కరోనాను తరిమికొట్టడానికి పెద్ద యుద్ధమే జరుగుతున్నది. వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఇలా ఎందరో ఫ్రంట్‌ లైన్‌ వారియర్లు ముందుండి కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. వారికి సహకరించడంతో పాటు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాల్సిన మహా ఆపద సమయమిది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా మాటేసి కాటేస్తోంది. అయితే, ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే.. మరోవైపు కొందరు విందులు, వినోదాలతో కొవిడ్‌-19 వ్యాప్తికి మరింత ఆజ్యం పోస్తున్నారు.

 


ఎవరికి వారే జాగ్రత్తలు పాటించి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాల్సిన మహా ఆపద సమయమిది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా మాటేసి కాటేస్తున్నది. కానీ మన సమాజంలో కొంత మంది విందులు, వినోదాలలో మునిగి తేలుతున్నారు. నిప్పుతో చెలగాటమాడినట్లు రేవ్‌ పార్టీల పేరిట చిందులు వేస్తూ కరోనా ముప్పును నెత్తిన తెచ్చి పెట్టుకుంటున్నారు. బర్త్‌డే పార్టీలు, సామూహిక విందులు, వినోదాలు మానుకోవాలని, వివాహాలకు 50మందిలోపే హాజరు కావాలని అధికారులు పదేపదే ప్రచారం చేస్తున్నా కొందరు తమ విలాసాలను మానడం లేదు. అందులో సమాజంలో  పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వివిధ వర్గాల వారు ఏమవుతుంది లే అని బరితెగించడం వల్ల కొంపలు మునుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం, వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులాగా మారుతున్నాయి.

 


ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయేలా ఉందంటున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సహకరించాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రభుత్వం నిరంతరం ప్రచారం చేస్తున్న స‌మ‌యంలో... పార్క్‌ హయత్‌ హోటల్‌లో రేవ్‌ పార్టీ, బేగంబజార్‌లో ఒక వజ్ర వ్యాపారి ఖరీదైన బర్త్‌డే పార్టీ, మాదాపూర్‌లో వివాహం, బాలాపూర్‌, అత్తాపూర్‌లో సంగీత్‌ ఫంక్షన్‌ ఇలా మహా ప్రళయ సమయంలోనూ విచక్షణ మరిచి విందులతో చిందులు వేయడం వల్ల రోజుకు వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.పేద, సామాన్య ప్రజలు కొంత అప్రమత్తంగా ఉంటున్నా సంపన్న వర్గాలు, యువకులు, ఇతర పెద్దలు తమ బాధ్యతను విస్మరించడం వల్ల తమకు చేటు చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం తెస్తున్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌లంద‌రినీ ఆప‌ద వైపు నెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: