చైనాను నమ్మడానికి లేదు. వారు వెయ్యేళ్ళు శత్రువు మీద యుధ్ధం చేస్తారు. అలాంటిది భారత్ విషయంలో కొద్ది నెలలకే వైరాగ్యం ఎలా వస్తుంది. అది కూడా వారు పంతం పట్టి కదలక మెదలక కూర్చున్న గాల్వాన్ లోయ వద్ద హఠాత్తుగా పెట్టే బేడా సర్దేసుకుని వెనక్కుపోవడం అంటే  తమాషాగానే ఉంది. అయితే ఇపుడు చైనా వెనక్కు తగ్గడం ఒక వ్యూహం ప్రకారమే అంటున్నారు.

 

ఇపుడు చైనా శిబిరాలు ఉన్న చోట మంచు పెళ్ళలు విరిగిపడుతున్నాయి. అంతే కాదు, గాల్వాన్ నది కూడా వానలతో ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. పైగా భారత్ నిఘా అన్ని వైపులా  గట్టిగా ఉంది. ఇంకోవైపు ప్రపంచం అంతా చైనాను దోషిగా చూస్తోంది. చైనా ఏ రకంగా దుందుకుడు చర్యలకు పాల్పడినా కూడా భారత్ కి అనూహ్య  మద్దతు లభించి అంతా ఒక్కటై మీద పడిపోతారు.

 

పూర్తిగా ఇది కాని కాలమని చైనా గ్రహించబట్టే చాలా తెలివిగా వెనక్కు తగ్గిందని అంటున్నారు. చైనా ఇపుడు వేసిన అడుగులు మరింత ముందుకు దూసుకువచ్చేందుకేనని కూడా అంటున్నారు. ఇక భారత్ కూడా ఆర్ధికంగా కొంత దెబ్బ తీసింది. చైనాతో దౌత్యపరమైన వత్తిడి తెస్తోంది. మరో వైపు ఇతర దేశాల పెట్టుబడులు కూడా చైనా నుంచి తరలిపోతున్నాయి. 

 

అనవసరంగా రచ్చ చేసుకుంటే రానున్న కాలంలో పూర్తిగా ఇబ్బందులు  పడతామని చైనా గ్రహించడం వల్లనే వెనక్కి తగ్గిందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి దీన్ని భారత్ విజయంగా చెబుతున్నా కూడా దీని మీద విదేశాంగ నిపుణులు దౌత్య వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చైనా అకస్మాత్తుగా  బుద్ధిగా వెళ్ళిపోయింది అంటే అందులో మతలబు ఉందని అనుమానిస్తున్నారు.

 

ప్రపంచమంతా ఆదమరచి ఉన్న వేళ, ప్రత్యేకించి భారత్  కాస్తా నిదానించిన  తరువాత చైనా మరోమారు గాల్వాన్ లోయ వద్ద యుద్ధ్హ భేరీ మోగించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి చైనా వెనక్కి తగ్గినా భారత్ ఎప్పటికపుడు అప్ర‌మత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: