విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన దాదాపు 12 మంది ప్రాణాలు తీసింది. మరెందరిపైనో తీవ్రమైన ప్రభావం చూపింది. ఇంకా కొందరు వైద్యం చేయించుకుంటూనే ఉన్నారు. ఈ ప్రమాదంపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ.. మొత్తానికి ప్రమాద కారణాలను తెలుసుకుంది. ఈమేరకు ఓ నివేదిక రూపొందించి సీఎం జగన్ కు అంద జేసింది. 

 

 


ఈ నివేదిక ప్రకారం.. ఎల్జీ ప్రమాదానికి అసలు కారణాలు ఏంటంటే... పరిశ్రమ నుంచి స్టైరీన్‌ ఆవిర్లు లీకైన ట్యాంకులో పాలిమర్స్‌ పరిమాణం అసాధారణంగా పెరుగుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ఏప్రిల్‌ 24నే గుర్తించినా యాజమాన్యం చర్యలు తీసుకోలేదట. అసలు దాన్ని ఓ  ప్రమాద హెచ్చరికగా భావించలేదు. అప్పుడే తగిన నియంత్రణ చర్యలు తీసుకుని ఉంటే మే 7న ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదు. 

 

 


ఇక స్టైరీన్‌ నిల్వ ట్యాంకు ఆకృతి పేలవంగా ఉంది. సేఫ్టీ ప్రోటోకాల్‌, భద్రత, రసాయనాల నిల్వపై సిబ్బందికి ఎలాంటి అవగాహన లేదని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో తేలింది. అలాగే బయట నుంచి చల్లబరిచే రిఫ్రిజిరేషన్‌ యూనిట్‌ సరిగ్గా లేదని కమిటీ గుర్తించింది.  సేఫ్టీ ఆఫీసర్‌, షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి, ఇంజినీర్లకు ఇంజినీరింగ్‌ అర్హతల్లేవని.. అసలు వారికి ఆ సామర్థ్యం కూడా లేదని తేల్చింది.

 

 


ఎల్జీ కంపెనీలోని ఎమ్‌6 స్టైరీన్‌ ట్యాంక్‌ పైపింగ్‌ను ఎవరికీ చెప్పకుండా గతేడాది డిసెంబరులో ఆ సంస్థ మార్చేసిందని కమిటీ గుర్తించింది. దీంతో సర్క్యులేషన్‌, మిక్సింగ్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదానికి అసలు  బీజం అప్పుడే పడిందని ఉన్నత స్థాయి కమిటీ తేల్చింది. అంతే కాదు.. స్టైరీన్‌ వంటి ప్రమాదకర రసాయనం నిల్వ ఉందని తెలిసినా లాక్‌డౌన్‌ సమయంలో దాని నిర్వహణకు కంపెనీ చర్యలేవీ తీసుకోలేదని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: