ఆయన ఓ సీనియర్ అధికారి. ఆయన రంగంలోకి దిగాడంటే ప్రత్యర్థి తోకముడవాల్సిందే.. అందుకే మోడీ పలు సంక్షోభ సమయాల్లోఆయన్ను ప్రయోగిస్తుంటారు. వయస్సు మీద పడుతున్నా.. సత్తా ఏమాత్రం తగ్గని వ్యక్తి అతడు.. అతడే అజిత్ ఢోబాల్. ఇప్పుడు చైనాతో ఘర్షణ నేపథ్యంలోనూ అజిత్ ఢోబాల్ రంగంలోకి దిగాడు.. 

 

 


గల్వాన్‌ లోయలో రెండు నెలల క్రితం నుంచి చైనా ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. గల్వాన్ ఘర్షణలో భారతీయ సైనికులు 20 మంది అమరులయ్యారు. చైనా వైపు నుంచి అంత కంటే ఎక్కువ మందే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ఈ ఘర్షణ తర్వాత రెండు దేశాలు శాంతి చర్చలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో చైనా బలగాలు తొలిసారిగా  ఒక కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లాయి. 

 

 


కయ్యాల మారి చైనా తోకముడిచి ఓ కిలోమీటరు వెనక్కి వెళ్లడానికి అసలైన కారణం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ అని తెలుస్తోంది. ఆయన చైనా విదేశాంగ మంత్రి  వాంగ్ యీతో రెండు గంటలపాటు వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఈ చర్చలు ఫలించాయి. రెండు దేశాలు వాస్తవాధీన రేఖను గౌరవించాలని అంగీకారానికి వచ్చాయి. ఏ దేశం ఏకపక్ష చర్యలకు దిగకూడదని అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

 

 


ఎన్‌ఎస్‌ఏ అజిత్ ఢోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చించారని.. ఎల్ఏసీ వెంట ఉన్న సైనిక బలగాలను పూర్తిస్థాయిలో సరిహద్దుల నుంచి వెనక్కి రప్పించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అందుకే.. ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి చైనా బలగాలు ఒక కిలోమీటరు మేర వెనక్కి వెళ్లాయి. మొత్తానికి ఢోబాల్ రంగంలోకి దిగడంతో చైనా ఒక కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లింది. దీంతో ఆయనపై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: