ప్రపంచదేశాలను చిగురుటాకులా వణికిస్తోన్న కరోనా వైరస్ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. డిగ్రీలు చేతిలో ఉన్నా ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. స్కూళ్లు, కళాశాలలు, బార్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు మూతబడటంతో లక్షల సంఖ్యలో ప్రజలకు ఉపాధి కరువైంది. గడిచిన మూడునెలలుగా జీతాల్లేక చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లోను రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండటంతో కొందరు దొరికిన పనితోనే పొట్టపోసుకుంటున్నారు. నిపుణులు కరోనా, లాక్ డౌన్ వల్ల బతుకుదెరువు దెబ్బతిన్న వారికి ఉపాధి కల్పన, ఆర్థిక చేయూత కల్పించే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ ప్రభావం మిగతా రంగాలతో పోలిస్తే విద్యా రంగంపై ఎక్కువగా పడింది. డిగ్రీ నుంచి పీజీలు, డబుల్‌ పీజీలు చేసినవాళ్లు నేడు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 
 
మరోవైపు కరోనా వల్ల జిమ్ కేంద్రాల పరిస్థితి కూడా ఇదేవిధంగా తయారైంది. జిమ్ ట్రైనర్లు పూర్తిగా ఉపాధి కోల్పోగా జిమ్‌లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా ప్రజలు రాలేని పరిస్థితి నెలకొంది. బార్లు తెరుచుకోకపోవడంతో వేలాదిమంది చిరుద్యోగుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. థియేటర్లలో పని చేసే వాళ్లు గత మూడు నెలలుగా ఉపాధి కోల్పోయారు. థియేటర్లు తెరిచినా సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. 
 
లాక్ డౌన్ తో గడిచిన 100 రోజులుగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. పైసా ఆదాయం లేక, ఉపాధి లేక ఉన్నదాంట్లోనే జీవనం సాగిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఆకలి చావులు నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమైతే మాత్రమే రోడ్డున పడ్డ ఉద్యోగుల బతుకులు మారే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: