తెలంగాణలో కరోనా కట్టడి తీరుపై సర్కారు వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన అమల్లో దారుణంగా ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాంపిళ్ల సేకరణ కేంద్రాలకు అనుమానితులు పోటెత్తుతున్నా... పరీక్షల ఫలితాలు ఇవ్వడంలో మాత్రం విపరీతమైన జాప్యం చేస్తున్నారు. 

 

 


సాధారణంగా పరీక్షల ఫలితాల వెల్లడికి 12 గంటల వరకూ సమయం సరిపోతుంది. అయినా కూడా చాలా చోట్ల అనుమానితుల నుంచి శాంపిళ్లు తీసుకుని ..నాలుగైదు రోజులు అవుతున్నా ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో అప్పటికే లక్షణాలు వున్న వారు రిపోర్టుల కోసం పరీక్షాకేంద్రాల చుట్టూ తిరగలేక అలసిపోతున్నారు. దీనికి తోడు కొత్తగా పరీక్షలు చేయించుకోవాలని వచ్చేవారు.. కరోనా ఉందో లేదో తెలుసుకుందామని వచ్చేలోపు తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని భయపడే పరిస్థితులు ఉన్నాయి. 

 

 


పరీక్షల ఫలితాల వెల్లడి విషయంలో ఇంతజాప్యం జరుగుతున్నా.. అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాల్లో 300 వరకు శాంపిళ్లు సేకరిస్తున్నారు. వాటిని ఉస్మానియా వైద్యకళాశాల ల్యాబ్‌కు పంపుతున్నారు.  అక్కడి నుంచి నగరంలోని ఇతర ప్రభుత్వ ల్యాబ్‌లకు వాటిని పంపి పరీక్షలు చేయిస్తున్నారు. ఇదంతా జరిగేందుకు మహా అయితే ఓ రోజు పడుతుంది. 

 

 


కానీ చాలాచోట్ల నాలుగైదు రోజుల వరకూ పరీక్షల ఫలితాలు రావడం లేదు. ఈలోపు లక్షణాలు ఉన్నవారు సమాజంలో తిరిగేస్తున్నారు. అనుమానితుల్లో దాదాపు  చాలా మందికి కరోనా పాజిటివ్ వస్తోంది. ఈ జాప్యం వల్ల కరోనా వ్యాప్తి మరింత ఊపందుకుంటోంది. అంతే కాదు.. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్ల పరీక్ష పూర్తయిన తర్వాత ఫలితాల  సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేసి చెప్పాలి. కానీ కొందరికే సమాచారం అందుతోంది. ఈ లోపాలను తెలంగాణ సర్కారు సత్వరమే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: