మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థలకు అంత ప్రాధాన్యం లేదు. అధికారం అంతా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల చేతుల్లోనే ఉంటుంది.కానీ రాజ్యాంగం ప్రకారం దేశానికి రాష్ట్రపతి, రాష్ట్రానికి గవర్నర్ అధిపతులుగా ఉంటారు.  అయితే రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తినప్పుడు తప్ప ఈ పదవులకు అంత ప్రాధాన్యం లేదు. 

 

 


ఇక ప్రత్యేకించి గవర్నర్ అయితే ఆయన రబ్బర్ స్టాంపు అన్న అభిప్రాయం బలంగా ఉంది. అయినా కూడా అప్పుడప్పుడు గవర్నర్ పాత్ర చాలా కీలకం అవుతుంటుంటుంది. అందుకే ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సంబంధాలు బావుంటే ఏ గొడవా ఉండదు. రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ కు ఈ సంగతి బాగా తెలుసు. అందుకే ఆయన పాత గవర్నర్ నరసింహన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. 

 

 


అయితే ప్రస్తుత గవర్నర్ తమిళసైకి  తెలంగాణ సీఎంకు మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు. కేసీఆర్ కూడా పాత గవర్నర్‌కు ఇచ్చినంత ప్రయారిటీ ఇవ్వడం లేదు. దీనికి తోడు ఇటీవల గవర్నర్ తమిళసై కాస్త స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి కరోనా కాలం నుంచి ఆమె కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు. మొన్నటికి మొన్న ఆమె ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. 

 

 


ఇక ఇటీవల పలువురు తెలంగాణవాసులు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ లో కరోనా సమస్య గురించి గవర్నర్‌ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారట. హైదరాబాద్‌లో పరిస్థితి దయనీయంగా ఉందని మొరపెట్టుకున్నారట. దీంతో ఆమె ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడడానికి ప్రయత్నించారట. కానీ ఆ ప్రయత్నాలు అంత సఫలం కాలేదని వార్తలు వస్తున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రాజ్‌భవన్‌ కబురు పెట్టినా వారు వెళ్లలేదట. 

 

 


ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని, తాము రాలేమని రాజ్‌భవన్‌కు స్పష్టం చేశారని అంటున్నారు. మరి రాష్ట్రాధిపతి పిలిచినా అధికారులు వెళ్లకపోవడం సీఎంకూ.. గవర్నర్‌కూ పెరిగిన అగాధమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: