తెలంగాణ ప్ర‌భుత్వం నూత‌న స‌చివాల‌యం నిర్మాణం కోసం ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వివిధ వ‌ర్గాలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందనే ఆస‌క్తి నెల‌కొంది. టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ దీనిపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత అర్థరాత్రి నుంచి సెక్రటేరియట్ కూల్చడం ప్రారంభించిన తీరును తెలంగాణ ప్రజలందరూ గమనించాలని కోరుతున్నానని విజ్ఞ‌ప్తి చేశారు.

 

ఒకవైపు రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువగా చేసిన కూడా రోజు 2000 కేసులు వస్తుంటే, కరోనాపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నారని whereiskcr# అని ప్రజలంతా ఒకవైపు అడుగుతుంటే, మరోవైపు సెక్రటేరియట్ కూల్చివేతను ప్రారంభించారని పొన్నం ప్ర‌భాక‌ర్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నూతన సెక్రటేరియట్ కట్టుకోవాలని ఆలోచన, తపన ఉంటే దానికి సమయం, సందర్భం అంటూ ఉంటుందని పొన్నం ప్ర‌భాక‌ర్ వివ‌రించారు. రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా కరోనా బారినపడి ఇబ్బందికర పరిస్థితులలో ఉంటే, రోజు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగస్తులకు సగం జీతా లు చెల్లిస్తుంటే ఈ సమయంలో నూతన సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. 

 

 

ఒకవైపు కరోనా వ్యాధి ప్రబలుతుంటే కరోనా నా కాకరకాయ నా అన్న మీరు దాని తర్వాత మిలటరీని దించుతం అని, కరోనాతో సహజీవనం చెయ్యాలని అంటున్న మీరు కరోనాతో సహజీవనం చేస్తున్నారా అని ప్రజలు అడుగుతున్నారని పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి తెలంగాణకి ? ప్రగతి భవన్ పేరు మీద సెక్రటేరియట్ పేరు మీద ఇలా అన్ని పాత కట్టడాలు కూల్చివేస్తూ, కొత్తవి కట్టుకుంటూ తానేదో నూతన తెలంగాణ నిర్మాణం చేస్తున్నానని చెప్పుకోవడానికి చేసే ఈ ప్రయత్నం ప్రజాధనం దుర్వినియోగం తప్ప వేరొకటి కాదని మండిప‌డ్డారు. ఇప్పటికే రెండు లక్షల 90 వేల కోట్ల అప్పు అయిందని పేర్కొన్న పొన్నం ప్ర‌భాక‌ర్ మళ్లీ కొత్తగా లక్షా యాభై వేల కోట్ల అప్పు తీసుకొని ఈ తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలో దించి మొత్తం వ్యవస్థనే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని పొన్నం ప్ర‌భాక‌ర్ ఆరోపించారు. దయచేసి ప్రజలారా గమనించండని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: