దేశంలో, తెలుగురాష్ట్రాల్లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత ఆహార భద్రత ప్రమాణాల మండలి పండ్లు, కూరగాయల కొనుగోలు, నిల్వ, ఇతర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తోంది. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 
 
పండ్లు, కూరగాయలు కొని ఇంటికి తెచ్చుకున్న తరువాత చేతులను మరోసారి శుభ్రం చేసుకోవాలి. కూరగాయలు కొనుగోలు చేసిన తరువాత నిల్వ చేయాలనుకుంటే 2 గంటల్లోపే ఫ్రిజ్ లో పెట్టాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 40 డిగ్రీల లోపు ఉండేలా చూసుకోవాలి. మాంసం లేదా చేపలను కొనుగోలు చేసిన వెంటనే వండుకోవడం మేలు. ఫ్రిజ్ లో ఉంచే డబ్బాలను తరచుగా శుభ్రం చేయాలి. 
 
 
ఇంట్లో, బయట ప్లేట్లు, గ్లాసులు, వస్తువులు, ఒకరు వినియోగించిన వాటిని మరొకరు వినియోగించకపోవడమే మంచిది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేంత వరకు బయటి వంటలకు దూరంగా ఉంటే మరీ మంచిది. ఆహారపదార్థాలపై ఉండే గడువు తేదీని బట్టి వాటిని ఆ తేదీలోగా వాడాలి. తక్కువ రోజులు గడువు ఉంటే వాటిని నిల్వ చేయకుండా వాడటం మంచిది. స్ట్రీట్ ఫుడ్ వల్ల కూడా వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
మరోవైపు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 22,252 కేసులు నమోదు కాగా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. భారత్ కరోనా వైరస్ విజృంభణలో మూడో స్థానంలో ఉంది. గడిచిన ఆరు రోజుల్లో దేశంలో 2760 మంది మృత్యువాత పడటం గమనార్హం.          

మరింత సమాచారం తెలుసుకోండి: