ఈ ఏడాది చివరి వరకు ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేసిన అమెరికా.... విదేశీ విద్యార్దులకు కూడా షాక్ ఇచ్చింది. ఫారిన్ స్టూడెంట్స్‌కు వీసాలు ఉపసంహరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్ధులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో దాదాపు అన్ని యూనివర్శిటీలు మూతపడ్డాయి. నేరుగా క్లాసులు నిర్వహించకుండా ఆన్‌లైన్‌ విధానం ద్వారా కోర్సులు కొనసాగించాలని యూనివర్శిటీలు భావిస్తున్నాయి. దీంతో వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా క్లాసులకు హాజరయ్యే అవకాశం ఉండటంతో విదేశీ విద్యార్ధులు అమెరికాలో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ ప్రభావం భారతీయ విద్యార్ధులపై ఎక్కువగా పడబోతోంది.

 

వ్యక్తిగతంగా యూనివర్సిటీ క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేని విదేశీ విద్యార్ధుల వీసాలను ఉపసంహరించుకుంటామని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటించింది. దీంతో లక్షలాది మంది విదేశీ విద్యార్ధులు సొంత దేశాలకు తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ కూడా దాదాపు అన్ని కోర్సులను ఆన్‌లైన్ మోడ్‌లోకి మారుస్తోంది. దీంతో ఇప్పటికే యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉండేవాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ వీసా నిబంధనలు ఎఫ్1, ఎమ్ 1 వీసాలున్న అందరికీ వర్తిస్తాయి.

 

హార్వర్డ్, కొలంబియా, స్టాన్‌ఫర్డ్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. ఈ యూనివర్శిటీలు అందించే కోర్సులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ప్రతి యేటా లక్షలాది మంది విదేశీ విద్యార్ధులు... అమెరికా యూనివర్శిటీల్లో అడ్మిషన్లు తీసుకుంటారు. వాస్తవానికి యూఎస్‌ యూనివర్శిటీలకు  ఫారిన్ స్టూడెంట్సే పెద్ద ఆదాయ వనరు. విదేశీ విద్యార్ధులంతా ఫుల్ ట్యూషన్ ఫీజు చెల్లిస్తారు. అందుకే యూనివర్శిటీలు కూడా విదేశీ విద్యార్ధులకు ప్రాధాన్యతనిస్తాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కరోనా కారణంగా అమెరికాలో ఇతర రంగాలతో పాటు విద్యావ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: