తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.  హైదరాబాద్‌లో అక్కడ.. ఇక్కడ అని కాదు.. నలుమూలల కరోనా పంజా విసురుతోంది. పెరుగుతున్న పాజిటివిటీ.. దేశంలో రాష్ట్రాన్ని ఆరోస్థానంలో నిలిపింది. ఈ నెలాఖరుకు తెలంగాణలో 50 వేల కేసులు నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.

 

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది.  పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు వణుకుపుట్టిస్తోంది. కేసులవారీగా చూస్తే దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆరో స్థానంలో నిలిచింది తెలంగాణ. హైదరాబాద్‌లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కేసులు ఇలాగే వస్తే నెలాఖరుకు 50వేలు దాటవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్‌.

 

జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గతంలో అంబులెన్స్‌లు కావాలంటూ ఫోన్‌ చేసే వారి సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ ఎప్పుడూ మోగుతూనే ఉందంటే తెలుసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.

 

రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరిగిపోతుండడంతో.. వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు సిద్ధమవుతోంది వైద్య ఆరోగ్యశాఖ. రానున్న రెండు మూడు రోజుల్లో యాంటీ బాడీ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల్లో కోవిడ్ లక్షణాలు ఏ మేర ఉన్నాయి.. వాటితో శరీరం ఏ విధంగా పోరాడుతోందనే విషయాలు తెలుసుకునేందుకు ఈ టెస్టులు చేయాలని భావిస్తోంది ఆరోగ్యశాఖ. సుమారు 25 వేల టెస్టులు చేసిన తర్వాత ఓ అంచనాకు రానుంది వైద్య ఆరోగ్యశాఖ.

 

శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయ్‌. అటువంటి వారిలో పాజటివిటీ రేటు సుమారు 34 శాతం పైన ఉన్నట్టు తెలిపింది ఆరోగ్యశాఖ. ప్రస్తుతమున్న పాజిటివ్ కేసులలో మూడు వేలకు పైగా కేసులు శ్వాస సంబంధిత వ్యాది ఉన్న వాళ్లదే. ప్రస్తుతమున్న కోవిడ్‌ చికిత్సల్లో హోం క్వారంటైన్‌ ఉంటున్న వాళ్లలో వీరికి ప్రమాదం పొంచి ఉందని, ఆసుపత్రిలో చేరాల్సిందిగా చెబుతున్నారు వైద్యులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: