తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత కొనసాగుతోంది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి కూల్చివేత పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు కొబ్బరికాయ కొట్టి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. ముందుగా జీ బ్లాక్, తర్వాత సీ బ్లాక్, అనంతరం సచివాలయం గేట్‌ దగ్గర ఉన్న పవర్ ఆఫీస్‌ను కూల్చివేస్తున్నారు. సెక్రటేరియట్ కూల్చివేతకు వీలుగా సచివాలయానికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో... రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. కొత్త సచివాలయం నిర్మించడానికి వీలుగా..పాత సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వీలుగా సెక్రటేరియట్‌ను ఖాళీ చేసి కార్యాలయాలన్నీ బీఆర్‌ భవన్‌కు తరలించింది. అయితే పురాతన కట్టడం కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ పిటిషన్లు అన్నింటిని  కొట్టివేసిన హైకోర్టు.... సచివాలయం కూల్చివేతకు అనుమతిచ్చింది. 

 

హైదరాబాద్‌లో పురాతనమైన కట్టడాల్లో సెక్రటేరియట్ ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సచివాలయానికి విశిష్ట చరిత్ర ఉంది. నిజాం కాలంలో నిర్మితమైన సచివాలయం భవనం స్వాతంత్ర్యానంతరం తెలుగు పరిపాలనకు కేంద్రబిందువయింది. నిజాం కాలంలో నిర్మించిన కట్టడాన్ని...తదనంతర కాలంలో పరిపాలనా అవసరాలకు అనుగుణంగా విస్తరించుకుంటూపోయారు. సెక్రటేరియట్‌లో అత్యంత పురాతన భవనమైన జీ బ్లాక్‌ను నిజాం నవాబు కాలంలో 1888లో నిర్మించారు. ఈ బ్లాక్‌ను తొలుత సైఫాబాద్ ప్యాలెస్‌గా, సర్వహితగా పిలిచేవారు. నిజాం నవాబు కాలం నుంచి..ఎన్టీఆర్ వరకు ఈ జీ బ్లాక్‌ నుంచే..పాలన సాగించారు. డంగ్‌ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లు ఉపయోగించి నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఎన్టీఆర్ తర్వాత ఈ బ్లాక్‌ను ఎవరూ ఉపయోగించలేదు. సచివాలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన సీ బ్లాక్‌లోకి  ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 1994లో మార్పించారు. అప్పటినుంచి ముఖ్యమంత్రులంతా సీ బ్లాక్ నుంచే పరిపాలన సాగించారు. 

 

సచివాలయం ప్రాంగణం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంగణంలో మొత్తం 10 బ్లాకులున్నాయి.  ఎన్టీఆర్ హయాంలో బ్లాకులకు పేర్లు పెట్టారు. పురాతనమైన జీ బ్లాక్‌ను 1888లో నిర్మించగా, 1964లో కే బ్లాక్‌ను నిర్మించారు. బీ, సీ బ్లాకులను 1978లో అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం ఆరు అంతస్థులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులంతా కొలువుతీరారు. ఏ బ్లాక్ భవన సముదాయాన్ని 1981లో అప్పటి ముఖ్యమంత్రి టీ. అంజయ్య ప్రారంభించారు.  A బ్లాక్‌లోనే ఫేజ్‌ 2ని 1998 ఆగస్టులో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు  ప్రారంభించారు. 2004 లో డీ బ్లాక్‌ను వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. చివరగా 2012లో సెక్రటేరియట్‌ను విస్తరించారు. ఆ ఏడాది నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకులు ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో ఐదు బ్లాకులను ఏపీకి, నాలుగు బ్లాకులను తెలంగాణకు కేటాయించారు. 1980ల నాటికే శిథిలావస్థకు చేరిన జీ బ్లాకును ఎవరికీ కేటాయించలేదు. ఏపీ బ్లాకులు కూడా ఇటీవలే తెలంగాణ ఆధీనంలోకి వచ్చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీంతో కలుపుకుంటే..మొత్తం 16 మంది ముఖ్యమంత్రులు పాత సచివాలయం నుంచి పాలన అందించారు. హైదరాబాద్ స్వరూపాన్ని, పరిపాలనా విధానాన్ని మార్చివేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించ తలపెట్టింది. హైకోర్టు అనుమతి కూడా లభించడంతో...సచివాలయం కూల్చివేత పనులు మొదలుపెట్టింది. 

 

మరో వైపు కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ సిద్ధం చేసింది. తెలంగాణ సచివాలయం కొత్త బిల్డింగ్ డిజైన్ విడుదల చేసింది. త్వరలోనే ఈ డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారు. పాత సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయం నిర్మించనుంది ప్రభుత్వం. 

 

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత కొనసాగుతోంది. అర్థరాత్రి మొదలైన కూల్చివేత పనులు... ఇంకా కొనసాగుతున్నాయి. సీ బ్లాక్‌ కూల్చివేత 50శాతం పూర్తి కాగా... రాక్ స్టోన్ బిల్డింగ్ 80 పూర్తైంది. ఇటు డీ బ్లాక్ కూల్చివేత కూడా ప్రారంభమైంది. సచివాలయం నుండి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐ మాక్స్, రవీంద్రభారతి,, లకిడికపూల్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ వద్ద వాహనాల దారి మల్లించారు పోలీసులు. కూల్చివేతలను డీజీపీ మహేందర్ రెడ్డి, CS సోమేశ్ కుమార్ పర్యావేక్షిస్తున్నారు. బీఆర్కేఆర్ భవనంలోని అన్ని కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: