మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టు.. మూడు నెలల క్రితం లాక్ డౌన్ నేపథ్యంలో భారత దేశంలో కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రపంచంలో మూడో స్థానం చేరుకుంది.  భార‌త్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది.  దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 22,252 కేసులు న‌మోదు అయ్యాయి.  24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా 467 మంది మ‌ర‌ణించారు.  దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరుకున్న‌ది.  దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,39,948 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా కేసులపై శివసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

క‌రోనా మ‌హ‌మ్మారిపై యుద్ధం మ‌హాభారత యుద్ధం కంటే చాలా క‌ష్ట‌మైన‌ది అని వ్యాఖ్యానించింది. క‌రోనా వైర‌స్‌పై యుద్ధంలో కేవ‌లం 21 రోజుల్లోనే విజ‌యం సాధిస్తామంటూ గ‌త మార్చి నెల‌లో ప్ర‌ధాని మోదీ ధీమా వ్య‌క్తం చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా శివ‌సేన గుర్తుచేసింది.  ఇప్పటికీ 100 రోజులు దాటి పోయింది.. కరోనా ఇంకా పెరిగిపోతూనే ఉంది. దీనిపై పోరాడుతున్న వారు అలసిపోతున్నారు' అని తన పత్రిక సామ్నాలోని ఓ కథనంలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని కలలు కంటోన్న భారత దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు దాదాపు 25,000 నమోదు అవుతుండడం దురదృష్టకరం.

 

అత్యధిక కరోనా కేసుల్లో మనం ఇప్పటికే రష్యాను కూడా దాటేశాం.  ముందు ముందు ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదంలో పడతామని అన్నారు. కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే  త్వ‌ర‌లోనే భార‌త్ అగ్ర‌స్థానానికి చేరుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదని అభిప్రాయ‌ప‌డింది. అంతే కాదు 2021 లోప‌ల‌ క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, అందువ‌ల్ల 2021 వ‌ర‌కు క‌రోనాతో యుద్ధం చేయాల్సిందేన‌ని సామ్నా పేర్కొన్న‌ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: