అదేంటి.. బుల్లితెర కామెడీ క్యారెక్టర్ బిత్తిరి సత్తి ఏంటి.. జగన్ తో చేతులు కలపడం ఏంటి అనుకుంటున్నారా.. కొంప దీసి బిత్తిరి సత్తి వైసీపీలో కానీ చేరాడా అనుకుంటున్నారా.. అదేమీ కాదులెండి.. కానీ బిత్తిరి సత్తి త్వరలోనే సాక్షి టీవీలో చేరబోతున్నాడని సమాచారం. ఇటీవలే బిత్తిరి సత్తి టీవీ 9 నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వీ6 నుంచి బిత్తిరి సత్తిని అత్యధిక పారితోషకం ఇచ్చి మరీ తెచ్చుకున్న టీవీ9 ఆ తర్వాత అతన్ని వదిలించుకుంది. 

 


బిత్తిరి సత్తి టీవీ9 ను ఎందుకు వదిలాడు.. వదలడానికి కారణమేంటి.. ఈ పరిమాణం అటు టీవీ9కు , ఇటు బిత్తిరి సత్తికి ఎలాంటి ఎఫెక్టు ఉంటుంది అనే సంగతి పక్కకు పెడితే.. ఇప్పుడు బిత్తిరి సత్తి సాక్షిలో చేరుతున్నాడన్న వార్త చాలా ఇంట్రస్టింగ్.. ఎందుకంటే.. బిత్తిరి సత్తి కామెడీకి చాలా ప్రజాదరణ ఉంది. సరైన స్క్రిప్టు ట్రీట్‌ మెంట్‌ ఉంటే.. బిత్తిరి సత్తి ప్రోగ్రామ్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో దూసుకుపోతుందని ఇప్పటికే వీ6 అనుభవం రుజువు చేసింది. 

 


మరోవైపు.. సాక్షి టీవీ రేటింగ్స్‌లో ఓ మాదిరిగా ఉన్నా.. హైదరాబాద్ రేటింగ్స్‌లో బాగా వెనుకబడి ఉంది. ఇప్పుడు బిత్తిరి సత్తి రాకతో ఆ ఏరియాలో బాగా పుంజుకోవచ్చన్నది సాక్షి టీవీ ఆలోచనగా కనిపిస్తోంది. దీనికితోడు తీన్మార్ వార్తలు, ఇస్మార్ట్ న్యూస్, మాస్ మలన్న, జోర్దార్ వార్తలు వంటి ప్రోగ్రాములు రేటింగ్స్‌లో దుమ్ముదులిపేస్తున్నాయి. వీ6 వంటి ఛానల్‌ కు తీన్మార్‌ వార్తలు గుండెకాయగా మారిందంటే అతిశయోక్తి కాదు. 

 

అందుకే బిత్తిరి సత్తి రాక సాక్షి టీవీకి మంచి బూస్టప్ అవుతుందన్న అంచనా ఉంది. గతంలో సాక్షి టీవీ డింగ్ డాంగ్‌ అంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా ఓ ప్రోగ్రామ్‌ చేసింది. అందులో తిరకాసు వంటి బిత్తిరి సత్తి వంటి క్యారెక్టర్ ఉండేది.. అది బాగా హిట్ అయ్యింది. ఒక విధంగా బిత్తిరి సత్తి వంటి క్యారెక్టర్‌ కంటే ముందే అది అలాంటి క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు బిత్తిరి సత్తి ప్రోగ్రామ్‌ కూడా సాక్షిలో హిట్ అయితే.. ఉభయులకూ ఈ డీల్ లాభదాయకమే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: