బీజేపీ... షార్ట్ కట్ లో మూడక్షరాలు ఉన్నా మూడు లోకాలను చుట్టి వచ్చే సత్తా ఉంది. ప్రత్యర్ధులకు మూడు కళ్ళు తెరచి భస్మీపటలం చేసే నైపుణ్యం కూడా ఉంది. బీజేపీని పెట్టిన నాటికి పుట్టనివారు ఇపుడు ఆ పార్టీని చూస్తే ఇలాగే అనుకుంటారు. కానీ అలనాటి వాజ్ పేయి, అద్వానీల బీజేపీ మాత్రం ఇది కాదు. అది తేడా గల పార్టీ, ఇది చాలా తేడా పార్టీ అని మాత్రం చెప్పగలరంతే. 

 

ఇదిలా ఉండగా బీజేపీకి ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలు  కచ్చితంగా కావాలి. ఎందుకంటే మోడీ చరిష్మా ఎండలో పెట్టిన ఐస్ క్రీం కంటే ఘోరంగా కరిగిపోతోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్ధిక మాద్యం వంటి పాపాల శాపాలు అన్నీ ఒకేసారి బీజేపీని చుట్టుముట్టబోతున్నాయి. వాటికి తోడు కరోనా స్రుష్టించిన కల్లోలంతో మరింతగా దేశం దిగజారితే అందులో నుంచి గెలుపు పిలుపు అందుకోవాలంటే మోడీ అమిత్ షా కొత్త దారులు వెతకాల్సిందే.

 

అందుకే వారు ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల మీద టార్గెట్ చేశారు. తెలంగాణాలో కేసీయార్ బలహీనం కావాలని కోరుకుంటున్న బీజేపీ ఏపీలో మాత్రం జగన్ బలాన్ని ఎలా తగ్గించాలా అని కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో  భాగంగా 2014 మాదిరిగా సామాజిక ప్రయోగం చేయడం ద్వారా జగన్ని కేవలం రాయలసీమకే పరిమితం చేయాలనుకుంటోంది.

 

కోస్తా జిల్లాలను అమాంతం పట్టేసి మొత్తంగా కాషాయం చుట్టేస్తే ఏపీలో అధికారం తమ పరం అవుతుంది అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దానికి తగిన కార్యాచరణను కూడా సిధ్ధం చేసుకుని ఉంచారు. కోస్తాలో ఎక్కువగా ఉన్న కాపులను, అలాగే గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న‌ రాజులను, ఇక నిన్నటిదాకా టీడీపీకి మద్దతు ఇచ్చి రాజకీయ పునరావాసం లేని కమ్మలను చేరదీయడం ద్వారా కోస్తాను జగన్ కి దక్కనీయకుండా చేయాలని పక్కా ప్లాన్ తో బీజేపీ ఉందిట.

 

అందుకే ఆ పార్టీ ఇపుడు టీడీపీ నేతలతో పాటు అధికార వైసీపీలో విసిగి వగచే నాయకులకు గేలం వేస్తోందిట. వారందరినీ బీజేపీ గూటికి చేర్చి మరో వైపు జనసేనాని పవన్ సినీ గ్లామర్ తోపాటు మోడీ రాజకీయ గ్లామర్ తో ఏపీలో జగన్ని ఢీ కొట్టాలని చూస్తోందిట. అంటే జగన్ తో సై అంటే సై అంటూ కోస్తా నాది అంటోది బీజేపీ. మరి దీనికి విరుగుడుగా జగన్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: