దక్షిణాదిన గర్వంగా చెప్పుకునే మహా నగరం హైదరాబాద్. కోటి జనాభాతో ప్రపంచంలో ఎన్నో చిన్న దేశాల కంటే పెద్దగా ఉన్న హైదారాబాద్ ఎంతో మందిని పోషిస్తోంది. ఇక్కడకు వచ్చిన వారు కష్టపడితే పొట్టపోసుకోవడం కష్తం కాదు. అటువంటి భాగ్యం కలిగినే హైదరాబాద్ ఇపుడు భయం గుప్పిట ఉంది.

 

ఒక్క లెక్కన పెరుగుతున్న కరోనా కేసులు హైదరాబాద్ ని కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉపాధి లేకుండా పోతోంది. చదువులు అటకెక్కాయి. ఏ రంగం చూసినా నీరసం వస్తోంది అందరికీ పడుకోపెట్టేసి తాను మాత్రం అలుపెరగకుండా వీర విహారం చేస్తోంది కరోనా. కరోనా దెబ్బకు మూడు నెలలుగా నగరం కళ తప్పేసింది.

 

ఇపుడు కరోనా కేసులు వెల్లువలా పెరుగుతూంటే మిగిలిన వారు కూడా తట్ట బుట్టా సర్దుకుంటున్నారు. ఇప్పటికే మొత్తం జనాభాలో పది నుంచి పదిహేను శాతం ఖాళీ చేసి ఎవరి ఊళ్ళకు వారు వెళ్ళిపోయారని తెలుస్తోంది. ఇక మిగిలిన వారు కూడా కరోనా మహమ్మారి పడగ కింద ఉండలేమని తమ సొంతూళ్ళకు చెక్కేస్తున్నారు. దాంతో ఇటు ఆంధ్రాకు తాకిడి పెరుగుతోంది.

 

హైదరాబాద్ పరిస్థితి ఇపుడు నాలుగు సంక్రాంతులు ఒకేసారి వచ్చి నగరం మొత్తం పల్లెలకు ఊడ్చేసినట్లుగా ఉందిట. కరోనా ఎపుడు తగ్గుతుందో తెలియదు, పైగా రోజు రోజుకి ఎవరికి వస్తుందో అంతకంటే తెలియదు. దాంతో జనాలు అంతా  భయంతో పాటు, ఉపాధి లేక భాగ్యనగరం విడిచి వెళ్తున్నారని అంటున్నారు. మొత్తం మీద భాగ్యనగరం బోసిపోతోంది. కరోనా తాకిడి తగ్గాలని అంతా మొక్కుకుంటున్నారు.

 

నిజానికి హైదరాబాద్ ఎంతో మంది భావిభాగ్య విధాత. మరెంతో మందికి కల్పతరువు. చల్లని గడ్డగా ఉంది. ఇక్కడకు చేరిన వారిని తన కడుపులో పెట్టుకునే అమ్మగా ఉన్న భాగ్యనగరం మళ్ళీ నాటి శోభను సంతరించుకోవాలని అంతా కోరుకుంటున్నారు. మళ్లీ కళకళలాడాలని గట్టిగా విన్నపాలు చేసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: