ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి వేరు పడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత ఈ మొత్తం ప్రజల అభిమానాన్ని సంపూర్ణంగా చూరగొన్న ముఖ్యమంత్రులు ముగ్గురే ముగ్గురు ఉన్నారు. వారిలో తొట్టతొలిగా చెప్పుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ తరువాత మళ్ళీ నిండుగా తెలుగు వారి దీవెనలు పొందినది నందమూరి తారకరామారావు. ఆ తరువాత తెలుగు నేల మొత్తం నుంచి నీరాజనాలు అందుకున్నది అచ్చంగా వైఎస్సార్ రాజశేఖరరెడ్డి మాత్రమే.

 

నిజంగా రాజశేఖరరెడ్డి 1989 తరువాత ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అన్న దానికి ఆయనకు ఇంతటి గొప్ప ప్రజాభిమానం దక్కడానికే అని సమాధానం వస్తుంది. నిజంగా ఏడాదికో సీఎం గా పాలించి నాడు అలా తెర వెనక్కు వెళ్ళిపోతే కనుక అందరిలాగానే రాజశేఖరరెడ్డి కూడా ఉండేవారు. కానీ ఆయన పాతికేళ్ల పాటు ఆ పదవి కొరకు  నిరీక్షించారు.

 

తాను ఎక్కవలసింది ముఖ్యమంత్రి సీటు మాత్రమే కాదు, తాను కొలువుండవలసింది శాశ్వతంగా తెలుగు హ్రుదయాలలో అని తెలుసుకున్నారు కాబట్టే ఆయన దేవుడిగా నేటికీ మిగిలిపోయారు. నిజానికి వైఎస్సార్ వచ్చేనాటికే రాజకీయ వ్యవస్థ మీద నాయకుల మీద ప్రజలకు బొత్తిగా నమ్మకం పోయాయి. మాట ఇచ్చి పదవులు అందుకున్నాక వాటికి పక్కన పెడతారని, మళ్లీ అయిదేళ్లకు ఓట్ల‌ కోసం వచ్చినపుడు కల్లబొల్లి హామీలు ఇస్తారని జనం భావిస్తూ వచ్చారు.

 

అయితే తాను అలాటి నాయకుడిని కానని, మాట తప్పను, మడమ తిప్పను అని వైఎస్సార్ నిరూపించుకున్నారు. ఆయన ఎన్ని హామీలు ఇచ్చారో అన్నింటినీ నెరవేర్చారు. అంతే కాదు, ఆయన గత ముఖ్యమంత్రుల కంటే ప్రజలకు చేరువ కావడానికి పాదయాత్ర చేయడం ఒక కారణం అయితే పేదల సీఎంగా వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మరో కారణం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఅంబర్స్మెంట్ వంటివి తలచుకుంటే కళ్ల ముందు వైఎస్సార్ గుర్తుకువస్తారు. ఆయన అయిదుంపావు ఏళ్ళు మాత్రమే ఏపీని పాలించారు. కానీ శాశ్వతమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. ప్రజా నేత అంటే ముందు ఆయన పేరే అంతా చెబుతారు అంటే వైఎస్సార్ ధన్యుడేనని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: