భారత్ అన్​లాక్ 2.0 స్టేజీలోకి ప్రవేశించింది. కానీ పోషకాహారం విషయంలో కొవిడ్-19 చూపించిన ప్రభావం రానున్న కొన్ని సంవత్సరాల్లోనే మనం అనుభవించే అవకాశం ఉంది. గర్భిణులు, రెండేళ్ల లోపు చిన్నారులపై లాక్​డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సమయంలో సరైన పోషణ లేకపోతే రక్తహీనత, బలహీనత, అనారోగ్యం వంటి సమస్యలు జీవితాంతం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. లాక్​డౌన్ కాలంలో (మార్చి 24 నుంచి మే 31 వరకు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇవన్నీ పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కాలేదు.

 

 

విద్య, వైద్యం, పోషకాహారం వంటి శిశు అభివృద్ధి వికాసం కోసం భారత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్​మెంట్ సర్వీస్ ​(ఐసీడీఎస్)ను రూపొందించింది. అంగన్​వాడీ కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అంగన్​వాడీ కార్యకర్తలు (ఏడబ్ల్యూడబ్ల్యూ), సహాయకులు(ఏడబ్ల్యూహెచ్) ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

 

 

2019 జూన్ నాటికి భారత్​లో 13.78 లక్షల అంగన్​వాడీ కేంద్రాలు ఉన్నాయి. 13.21 లక్షల అంగన్​వాడీ కార్యకర్తలు, 11.82 లక్షల సహాయకులు ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్నారు. గత 45 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ కేంద్రాలు పోషకాహారం అందించేందుకు భారత్​ చేస్తున్న ప్రయత్నాల్లో వెన్నెముకగా నిలుస్తున్నాయి.''సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్​కు చెందిన అకౌంటబిలిటీ ఇనిషియేటివ్​లో భాగంగా ఈ పథకం పురోగతిని దశాబ్దకాలం పాటు పరిశీలించాం. కొవిడ్-19 సంక్షోభానికి ముందే చాలా అంశాల్లో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ సమస్యలను కరోనా మహమ్మారి మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.''

 

 

అందరికీ పూర్తి స్థాయిలో పథకం అందుబాటులో లేకపోవడం ఇందులోని మొదటి సమస్య. ఐసీడీఎస్ అనేది సార్వత్రిక పథకం. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ ఈ పథకానికి అర్హులు. 2019 జూన్ నాటికి 8.36 కోట్ల మంది అంగన్​వాడీ కేంద్రాల నుంచి అనుబంధ పోషణ రూపంలో వండిన ఆహారం(హెచ్​సీఎం) లేదా టేక్​ హోమ్ రేషన్(టీహెచ్​ఆర్-పప్పు వంటి ఆహార పదార్థాలు)​ను తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: