దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఎవరికైనా కరోనా సోకి వైద్యం చేయించుకోవాలంటే ఖర్చులు భారీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స ఇస్తున్నా.. సామర్థ్యానికి మించి రోగులు వస్తున్న కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులవైపు వెళ్లక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైద్యం పేరుతో భారం తగ్గించేందుకు కొవిడ్​-19 ప్రామాణిక బీమా తీసుకురావాలని.. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఇటీవల జనరల్, ఆరోగ్య బీమా కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ నేపథ్యంలోనే ప్రామాణిక బీమాను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయా సంస్థలు. జులై 15 నుంచి వీటిని విక్రయించనున్నాయి.అయితే ఇప్పటికే కరోనాకు సంబంధించి కొన్ని బీమాలు అందుబాటులో ఉన్నాయి. మరి వాటితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఎవరికి ఏ బీమా సరిపోతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

 


స్వల్ప కాలానికి సంబంధించి బీమా తదితర సదుపాయాలు అందించేందుకు జీవిత బీమా సంస్థలకు కూడా అనుమతులు మంజూరు చేసింది ఐఆర్​డీఏఐ. ఇవి ఆరోగ్య బీమా పాలసీలు అయినా కరోనా వైద్యానికి కూడా కవరేజ్ ఇస్తాయి. అయితే ఇవి పూర్తి మొత్తాన్ని కవరేజ్ ఇవ్వట్లేదు. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ.. వ్యాధి సోకిన వారు రూ.50వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని బీమా రంగ నిపుణులు అంటున్నారు.

 

 

కొవిడ్-19కు సంబంధించిన పాలసీలు ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీల్లో బీమా చేయించుకున్న నిర్ణీత మొత్తాన్ని కంపెనీలు చెల్లిస్తాయి.ఆరోగ్య బీమా విషయంలో రూమ్ ఛార్జీలు, వైద్యేతర ఖర్చులు తదితర కొన్ని ఛార్జీలను డిడక్షన్లుగా పరిగణిస్తారు. కొవిడ్ విషయంలో అవి ఎక్కువగా ఉంటున్నాయి.పేషెంట్ దగ్గరే ఉండే మెడికల్ ఆఫీసర్, నర్సింగ్, హైజీన్ తదితరాలకు ఖర్చు ఎక్కువే ఉంటోంది. సాధారణంగా వీటన్నింటిని బీమా కంపెనీలు రూమ్ ఛార్జీల కింద పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి ఆరోగ్య బీమా పాలసీలో వీటికి సంబంధించిన పూర్తి మొత్తాన్ని బీమా కంపెనీలు అందించటం లేదు. కొవిడ్ విషయంలో ప్రత్యేకంగా రోగి ఉండే గదికి సంబంధించిన బిల్లు సాధారణ గది ఛార్జీల లిమిట్ కంటే ఎక్కువ ఉంటున్నాయి.


ఆరోగ్య బీమాలో వైద్యేతర ఖర్చులకు 3 నుంచి 5 శాతం పరిమితి ఉంటుంది. కొవిడ్​కు సంబంధించి పీపీఈ కిట్లు, ఇతర వైద్యేతర ఖర్చులకు 10-25 శాతం ఉంటున్నాయి. వీటిని కూడా బీమా సంస్థలు పూర్తిగా చెల్లించటం లేదు. వీటన్నింటి దృష్ట్యా నిర్ణీత ప్రయోజనం కలిగి బీమా లేదా యాడ్-ఆన్ ద్వారా ఈ డిడక్షన్లకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. వీటి విషయంలో రెండు లక్షల వరకు బీమా తీసుకోవచ్చని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: